SAKSHITHA NEWS

మిత్రుడి ఇంటికి వెళ్ల‌డం కోడ్ ఉల్లంఘ‌న కిందకు రాదు.. ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ వ్యాజ్యం


ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి శిల్పా ర‌విచంద్ర త‌ర‌ఫున నంద్యాల‌లో బ‌న్నీ ప్రచారం

ఈ కార్య‌క్ర‌మానికి భారీగా త‌ర‌లివ‌చ్చిన జనం

ముంద‌స్తు అనుమ‌తి లేకుండా కార్య‌క్ర‌మం నిర్వహించారంటూ డిప్యూటీ త‌హ‌సీల్దార్‌ పోలీసుల‌కు ఫిర్యాదు

దీంతో అల్లు అర్జున్‌తో పాటు శిల్పార‌విపై కేసు న‌మోదు

నంద్యాల ప‌ర్య‌ట‌న వ్య‌క్తిగ‌తం అన్న అల్లు అర్జున్‌
త‌మ‌పై న‌మోదైన కేసు కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో బ‌న్నీ వ్యాజ్యం
ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖ‌లు చేశారు. ఏపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా వైసీపీ అభ్య‌ర్థి శిల్పా ర‌విచంద్ర కిశోర్‌రెడ్డి త‌ర‌ఫున నంద్యాల‌లో ఈ ఏడాది మే 11వ తేదీన‌ బ‌న్నీ ప్ర‌చారంలో పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి అభిమానులు, జ‌నాలు భారీగా పోటెత్తారు.

దాంతో అధికారులిచ్చిన ఉత్త‌ర్వుల‌ను ఉల్లంఘించారంటూ నంద్యాల రెండో ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్‌లో అల్లు అర్జున్‌తో పాటు శిల్పా ర‌విచంద్ర‌పై కేసు న‌మోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ వారు హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ‌ను నిలుపుద‌ల చేస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని త‌మ వ్యాజ్యంలో పేర్కొన్నారు.

నంద్యాల రెండో ప‌ట్ట‌ణ స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్, డిప్యూటీ త‌హ‌సీల్దార్‌, 2024 సాధార‌ణ ఎన్నిక‌ల ఫ్ల‌యింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్‌ఛార్జి పి. రామ‌చంద్ర‌రావును ప్ర‌తివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం సోమ‌వారం జాబితాలో ఉన్న‌ప్ప‌టికీ.. కోర్టు స‌మ‌యం అయిపోవ‌డంతో విచార‌ణ బుధ‌వారానికి వాయిదా ప‌డింది.

అయితే, ఈ కార్య‌క్ర‌మానికి శిల్పార‌వి గానీ, అల్లు అర్జున్ త‌ర‌ఫున గానీ ముంద‌స్తు అనుమ‌తి తీసుకోలేదు. దాంతో ఇది ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని డిప్యూటీ త‌హ‌సీల్దార్‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో శిల్పార‌వితో పాటు బ‌న్నీపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఈ కేసు విష‌య‌మై తాజాగా అల్లు అర్జున్‌, శిల్పా ర‌విచంద్ర‌ హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ వేశారు. త‌న మిత్రుడు కిశోర్‌రెడ్డి ఇంటికి వెళ్ల‌డం త‌న వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న అని, ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నందున అభినందించేందుకు వెళ్లాన‌ని బ‌న్నీ తెలిపారు. బ‌హిరంగ స‌భ నిర్వ‌హించే ఉద్దేశం త‌న‌కు లేద‌న్నారు. వ్య‌క్తిగ‌త సంద‌ర్శ‌న కోడ్ ఉల్లంఘ‌న కింద‌కు రాద‌ని పేర్కొన్నారు. అందుకే త‌మ‌పై న‌మోదైన కేసును కొట్టేయాల‌ని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిటిష‌న్‌ను స్వీక‌రించిన‌ న్యాయ‌స్థానం బుధ‌వారం విచారించ‌నుంది.


SAKSHITHA NEWS