చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
పేపర్ లీకేజీ విషయం లో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. చిట్యాలలో గురువారం నాడు స్థానిక మేకల లింగయ్య స్మారక భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బండి సంజయ్ సెల్ ఫోన్ పోలీస్ లకు దొరికితే అనేక విషయాలు బయటకు వస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి రాజకీయంగా లబ్ది పొందాలని మతోన్మాదాన్ని రెచ్చ గొట్టడంతోపాటు దేవుడి పేరుతో, మతం పేరుతో, పండుగల పేరుతో ప్రజలందరి మద్య చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
పెరిగిన ధరలతో పాటు, నిరుద్యోగం, కార్మికుల హక్కులు, మహిళలకు స్వేచ్చ వంటి అన్ని వర్గాల ప్రజల సమస్యలు బిజెపి నాయకులకు అక్కర్లేదు అని, తక్కువ సమయంలో కోట్ల రూపాయలు సంపాదించిన అధానీ గురించి ఒక్క మాట మాత్రం మాట్లాడకపోవటంతో ప్రజలు గమనిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వ, నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా యువతీ యువకులు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు అందరూ రాబోయే రోజుల్లో పోరాటాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, జిట్ట సరోజ, మండల పార్టీ నాయకులు నారబోయిన శ్రీనివాసులు, శీలా రాజయ్య, లడే రాములు తదితరులు పాల్గొన్నారు.