మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో అర్ధరాత్రి కాల్పుల ఘటన జిల్లాలో కలకలం రేపింది. అదనపు కట్నం కోసం ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి అత్తమామల పై కాల్పులు జరిపిన సంఘటన కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో చోటుచేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామానికి గ్రామానికి చెందిన గోరేటి శంకర్ లక్ష్మీ లపై అల్లుడు గోమాస నరేందర్ మంగళ రాత్రి పిస్టల్ తో ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో అత్తమామలు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కొద్ది నెలలుగా ఆస్తి కోసం అత్త మామ, అల్లుడి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఇదే క్రమంలో గోమాస నరేంద్ర తన భార్యను కొట్టి అదనపు కట్నం తేవాలని పుట్టింటికి పంపించారు. అంతటితో ఆగకుండా ఆస్తి కోసం గొడవ చేయడానికి కరీంనగర్ నుంచి గోమాస్ నరేందర్ తన స్నేహితుడు మహేష్ తో అత్తింటికి వచ్చాడు. అదనపు కట్నం కోసం అత్తమామలతో గొడవకు దిగారు. ఏదో అఘాయిత్యానికి ఒడి కట్టడానికి వచ్చాడని గ్రహించిన అత్తమామలు ఇంటి వెనక తలుపులు వేసి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో కోపోద్రిక్తుడైన నరేందర్ తన దగ్గర ఉన్న పిస్టోల్ తో నేలపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అక్కడి నుంచి తన స్నేహితుడితో కలిసి పారిపోయాడు. ఈ ఘటనలో రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సందర్శించారు.
నిందితుడికి తుపాకీ ఎక్కడిది..
ఆస్తి కోసం అత్త మామల పై కాల్పులు జరిపిన నిందితుడు నరేందర్‌కు తుపాకీ ఎక్కడదని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ నివాసం ఉంటున్న గోమాత నరేందర్ అత్తమామలతో కొంతకాలంగా అదనపు కట్నం కోసం గొడవ చేస్తున్నారు. ఇదే క్రమంలో రూ.10 లక్షల అదనపు కట్నం తీసుకురావాలని భార్యను కొట్టి కన్నేపల్లికి పంపించాడు. తుపాకితో బెదిరించి డబ్బులు గుంజాలనే ఉద్దేశమా లేక హత్య చేయాలని పథకం ప్రకారం వచ్చాడా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా అదనపు కట్నం కోసం అత్తమామలను హత్య చేయడానికి నిందితుడు తుపాకీని వినియోగించడం పై పోలీసులు విచారణ చేపట్టారు. అదనపు కట్నం కోసం అత్తమామలపై అల్లుడు తుపాకితో కాల్పులకు దిగడం సంచలనంగా మారింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.