వరుస పెట్టి వైసీపీకి సినీనటుల గుడ్ బై..
థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారంటూ వణికిపోతోన్న ఆర్జీవీ
అమరావతి/
అడ్డూ అదుపు లేని మాటలు, అసభ్యకర కామెంట్స్..గత ఐదేళ్లలో వాళ్లు మాట్లాడిందే హాట్ టాపిక్. వాళ్ల టార్గెటే కూటమి నేతలు. ఇప్పుడు సీన్ మారిపోయింది. అన్న కోసం ఏందాకైనా రెడీ అన్నోళ్లంత సైలెంట్ అయిపోతున్నారు. వరుసపెట్టి ఫ్యాన్ పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు. అలీ నుంచి ఇప్పుడు పోసాని వరకు ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు.
మరోవైపు వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీసిన డైరెక్టర్ ఆర్జీవీ ఇప్పుడు కేసులు ఫేస్ చేస్తున్నారు. బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కారు. ఇలా కూటమి నేతల మీద గత ఐదేళ్లలో అడ్డగోలుగా మాట్లాడినోళ్లంతా ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ కేసులో మూసేస్తారోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట.
ఎన్నికల తర్వాత వైసీపీతో పాటు రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించారు నటుడు అలీ. అంతకముందు వైసీపీలో చేరిన ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఫ్యాన్ పార్టీ ఘోర ఓటమితో ఈ వివాదాలేవీ తెరమీదకు రాకముందే పార్టీ, పాలిటిక్స్‌కు దూరం అవుతున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చేశారు.
మిగతావారంతా సైలెంట్
ఇక లేటెస్ట్గా సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం తెరమీదకు రావడంతో మిగతావారంతా సైలెంట్ అయిపోతున్నారు. ఈ మధ్యే నటి శ్రీరెడ్డి రాజకీయ కామెంట్స్ చేయనంటూ ఓ వీడియో రిలీజ్ చేసి..తనను వదిలేయాంటూ వేడుకుంది. అప్పటికే ఆమె మీద అక్కడక్కడ కేసులు నమోదు అవుతూ వచ్చాయి.
ఇప్పుడు పోసాని కృష్ణమురళి వంతు వచ్చింది. చంద్రబాబు, పవన్, లోకేశ్ మీద అడ్డగోలుగా మాట్లాడారంటూ ఆయన మీద ఏపీలో అక్కడక్కడ పది కేసుల వరకు నమోదు అయ్యాయట. ఈ నేపథ్యంలో పోసాని అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జరిగింది. వెంటనే మీడియా ముందుకు వచ్చిన పోసాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా ఇకపై పాలిటిక్స్ మాట్లాడనంటూ ప్రకటించేశారు. ఇప్పటివరకు తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదని..వైసీపీలో కూడా తనకు మెంబర్ షిప్ లేదని..ఫ్యామిలీకే టైమ్ కేటాయిస్తానంటూ చెప్పుకొచ్చారు.
ఆర్జీవీకి అరెస్ట్ భయం
మరోవైపు డైరెక్టర్ ఆర్జీవీని అరెస్ట్ భయం వెంటాడుతోంది. వ్యూహం సినిమా రిలీజ్ టైమ్‌లో బాబు, లోకేశ్‌పై మార్ఫింగ్ ఫోటోలు పెట్టారంటూ ఆయన మీద ఒంగోలులో కేసు నమోదు అయింది. పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళ్లారు ఆర్జీవీ. సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నానని..వారం రోజుల టైమ్ కావాలంటూ పోలీసులను కోరిన వర్మ..తర్వాత బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు.
అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని.. తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ పిటిషన్ వేశారు. ఇలా వైసీపీ హయాంలో కూటమి నేతల మీద అడ్డగోలు కామెంట్స్ చేసిన వారంతా ఇప్పుడు వణికిపోతున్నారు. కేసులకు భయపడిపోతున్న నటులు రాజకీయాలకు దూరంగా ఉంటామంటూ ప్రకటిస్తున్నారు. అయితే వైసీపీకి రిజైన్ చేసినంత మాత్రాన పోలీసులు, కూటమి ప్రభుత్వం వీళ్లను వదిలేస్తుందా..లేక కేసులు అరెస్టులు ఉంటాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.