-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 లకు గ్యాస్ సిలిండర్ పథకానికి లబ్ధిదారుల క్షేత్ర తనిఖీలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. కలెక్టర్, నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నుండి ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి తో కలిసి, టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో గ్యాస్ సిలిండర్ పథకం క్షేత్ర తనిఖీలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం క్రింద రూ. 500 లకు గ్యాస్ సిలిండర్ అందించేందుకు లబ్ధిదారుల క్షేత్ర పరిశీలన చేయాలన్నారు.
జిల్లాలో ఈ పథకం కొరకు 3 లక్షల 20 వేల 605 దరఖాస్తులు రాగా, ఒక లక్షా 70 వేల 655 రేషన్ కార్డ్ డాటాబేస్ తో మ్యాపింగ్ అయివున్నట్లు ఆయన తెలిపారు. మిగులు ఒక లక్షా 49 వేల 950 దరఖాస్తులపై క్షేత్ర తనిఖీలు చేయాలన్నారు. దరఖాస్తుల్లో గ్యాస్ ఏజెన్సీ పేరు, వినియోగదారుని నెంబరు పొందుపర్చని చోట వివరాలు సేకరించాలన్నారు. కుటుంబం యూనిట్ గా దరఖాస్తుల పరిశీలన చేయాలన్నారు. జిల్లాలో 34 మంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్లు, ప్రతి వినియోగదారుడు గ్యాస్ కనెక్షన్ ను ఆధార్ తో లింక్ చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబానికి అట్టి విషయం నమోదు చేయాలన్నారు. లబ్ధిదారుల పరిశీలనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు.
ఈ సమీక్ష లో జెడ్పి సిఇఓ అప్పారావు, డిపిఓ హరికిషన్, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్రీలత, జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎస్వో అంకుర్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఎస్వో విమల్, డిస్ట్రిబ్యూటర్లు కిరణ్, మనోజ్, వాసు, నగేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.