SAKSHITHA NEWS

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు లో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. నగరంలోని చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో ప్రైవేటు పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్‌లో పోలీసులు వీటిని గుర్తించారు. అందులో జిలెటిన్‌ స్టిక్స్‌, ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లతోపాటు ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది తనిఖీల్లో భాగంగా వీటిని గుర్తించినట్లు తెలిపారు. ట్రాక్టర్‌ యజమానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కొద్ది రోజుల క్రితం నగరంలో బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పేలుడు పదార్థాలు ప్రత్యక్షం కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 
ఈ నెల ఒకటో తేదీన బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో ఉన్న రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు ఘటనలో 9 మంది గాయపడ్డారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ఎన్‌ఐఏ ప్రకటించింది. మరోవైపు ఈ కేసులో నిందితుడికి సహకరించాడనే ఆరోపణలతో ఓ అనుమానితుణ్ని గత వారం దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. 


SAKSHITHA NEWS