SAKSHITHA NEWS

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి’ అనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం విజయవంతంగా ప్రారంభించింది.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి పెట్టుబడులే లక్ష్యంగా ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్‌ వరుసగా కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు.ఇక ఈ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది.

ఈ వేదిక ఆధ్వర్యంలో ‘సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌ సీ4ఐఆర్‌,ను హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది.బయో ఏషియా-2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు.

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో వేదిక అధ్యక్షుడు బర్గె బ్రెండ్‌ ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్‌ బృందం చర్చలు జరిపింది. అనంతరం ఈ విషయాన్ని సంయుక్తంగా ప్రకటించారు.

జీవ వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణలో నెలకొల్పనున్న ఈ కేంద్రానికి ప్రపంచ ఆర్థిక వేదిక పరిపూర్ణ సహకారాన్ని అందించనున్నట్లు బర్గె బ్రెండ్‌ వెల్లడించారు.

ప్రపంచ ఆర్థిక వేదిక విశాల దృక్పథం, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని సీఎం రేవంత్ అన్నారు. అందుకే రెండింటి మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరిందని చెప్పారు.

Whatsapp Image 2024 01 17 At 11.11.35 Am

SAKSHITHA NEWS