శ్రీనివాససేతుపై అపోహలకు గురికాకండి – కమిషనర్ అనుపమ అంజలి
సాక్షిత : తిరుపతి శ్రీనివాససేతు ప్రాజెక్ట్ టిటిడి, స్మార్ట్ సిటి ప్రాజెక్ట్ వారి సంయుక్త భాగస్వామ్యంతో పనులు జరుగుతున్నాయని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, స్మార్ట్ సిటి ఎం.డి అనుపమ అంజలి, టిటిడి చీప్ ఇంజనీర్ నాగేశ్వర్ రావు తెలిపారు. శ్రీనివాస సేతు పనులు దాదాపు 85 శాతం పూర్తి కావడం జరిగిందని, మొదటి దశ శ్రీనివాసం నుండి నంది సర్కిల్ వరకు ఫిబ్రవరి నుండి ప్రజలు, యాత్రికుల సౌకర్యార్దం రాకపోకలు అనుమతించబడినవని, అదేవిధంగా రెండవ దశ కరకంబాడి రోడ్డు నుండి ప్రకాశం పార్క్ వరకు గత విజయదశమి నుండి రాకపోకలు అనుమతించబడినవని వారు తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చిన అపోహల్లో జాయింట్లు ఉడిపోయి పడిపోయే ప్రమాదం జరుగుతుంది అనే అపోహలతో అవాస్తవాలు రావడం జరిగిందని తెలుపుతూ, వాస్తవ పరిస్థితి ప్రకారం ఫేషియో ప్యానల్ అనేది 2 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల ఎత్తున, 60 ఎం.ఎం మందంతో, ఎం.35 గ్రేట్ కాంక్రీట్ తో తయారు చేయబడి, బ్రిడ్జి అంచున ఇరువైపులా ప్రమాద నివారణకు (క్రష్ బ్యారియర్స్) ఏర్పాటుచేసిన ఆర్.సి.సి గోడలతో నిర్మాణం చేయబడిందన్నారు
. వచ్చిన కొన్ని అపోహల ప్రకారం ఎక్కడ గాని ఎలాంటి పగుళ్లు లేవని, భవిష్యత్తులో కూడా పగుళ్లు వచ్చే ఆస్కారం లేదన్నారు. నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్, ఆప్కాన్స్ ఇంజనీర్లు ప్రస్థుతం కూడా క్షున్నంగా ప్రాజెక్ట్ ను పరిశీలించి ఎలాంటి ప్రమాదం లేదని తెలపడం జరిగిందని, కావున ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని వారు తెలియజేసారు.
శ్రీనివాస సేతు నిర్మాణం మొదలుపెట్టినటువంటి బహుళ దేశ పేరు ప్రఖ్యాతిగాంచిన ఆప్కాన్స్ సమస్థచే పనులు చేపట్టబడి జరుగుచున్నవని, నిర్మాణం మొదలైన మొదటి తేదీ నుండి ప్లానింగ్, డిజైన్లు కూడా ఐఐటి ముంబాయి వారిచే తనిఖీ చేయబడి తద్వారా అనుమతించబడిందన్నారు. ఇవే కాకుండా భారత ప్రభుత్వంచే నియమించబడిన క్వాలిటీ కంట్రోల్ వింగ్ (ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ) ఏయికామ్ సంస్థ ద్వారా, స్మార్ట్ సిటీ ఇంజనీర్లచే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు జాగ్రత్తలు, సంబంధిత పరీక్షలు చేయుచూ ఇండియన్ స్టాండర్డ్ నియమ నిబంధనలు ప్రకారం అనుమతిస్తూ పనులు జరిగాయాన్నారు.