SAKSHITHA NEWS

యాత్రతో రాత మారేనా?

▪️రేపటి నుంచే కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో యాత్ర’

▪️రాహుల్‌ గాంధీ పాదయాత్రపై భారీ ఆశలు పెట్టుకున్న పార్టీ

న్యూఢిల్లీ:ఎన్నికల్లో వరుస పరాజయాలు..కీలక నేతల నిష్క్రమణలు.. అంతర్గత కుమ్ములాటలతో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’కు బుధవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. ఈ యాత్రపై కాంగ్రెస్‌ భారీ ఆశలే పెట్టుకుంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి, ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న వేళ 3,500 కిలోమీటర్ల పై చిలుకు యాత్ర పార్టీకి పునరుత్తేజం తెస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు ఆశిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. రాహుల్‌ యాత్రతో పార్టీకి ఎంతమేర ప్రయోజనం చేకూరుతుందన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.

క్విట్‌ ఇండియా ఉద్యమమే స్ఫూర్తిగా…

ఎనభై ఏళ్ల క్రితం గాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సెప్టెంబర్‌ 7 నుంచే రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర మొదలుపెట్టనున్నారు. 117 మంది కాంగ్రెస్‌ నాయకులతో కలిసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకూ ఐదు నెలలు పాదయాత్ర చేయనున్నారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్‌ చేసేలా రూట్‌మ్యాప్‌ రూపొందించారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాదం, అసహన రాజకీయాలను ప్రస్తావించడంతోపాటు జీవనోపాధిని నాశనం చేసే ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయం చూపాలని భావిస్తోంది. రైతు వ్యతిరేక చట్టాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రైవేటీకరణ వంటి అంశాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లనుంది.

దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపడంతో పాటు కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం, రాష్ట్రాల్లో పాగా వేయాలన్న బలమైన రాజకీయ ఆకాంక్షతో కాంగ్రెస్‌ ఈ యాత్ర చేపడుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు పార్టీకి పరీక్షగా నిలవనున్నాయి. వీటిలో తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీతోనే ముఖాముఖి పోరాడాల్సి ఉంది. ముఖ్యంగా గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాల పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాలి. కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. గుజరాత్‌లో కాంగ్రెస్‌ స్థానాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆక్రమిస్తోంది. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ మళ్లీ గద్దెనెక్కడం అంత సులభం కాదు. అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.


SAKSHITHA NEWS