SAKSHITHA NEWS

సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కుట్టు మిషన్ శిక్షణ పొందిన నియోజకవర్గంలోని వివిధ మండలాల మహిళలకు మాజీ మంత్రి హరీష్ రావు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తూ.. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. గత ఎండాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు నింపుకొని పంటలు ఎండిపోకుండా కాపాడుకున్నట్లు గుర్తు చేశారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయమే ప్రధాన ఎజెండాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తూ నీళ్లు విడువడం లేదన్నారు.

సాగునీరు అందక రైతులు కష్టాలు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం అంతా నీళ్లు లేక బోర్లు ఎండిపోతాన్నాయన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలన్న ఆలోచనతో సమగ్రాభివృద్ధే ధ్యేయంగా విద్యాక్షేత్రంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. సిద్దిపేట అభివృద్ధి కోసం, ఇక్కడి ప్రజలను కాపాడుకోవడం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తా..ఎందాకైనా కొట్లాడుతా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదరి మణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలు మరిచిపోను..మీ ఆశీర్వాదం ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని హరీష్ రావు ఆకాంక్షించారు.

కోటిలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని కోటిలింగాల దేవాలయంలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ…శివుడి ఆశీస్సులతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమై, పాడి పంటలతో అభివృద్ధిలో ముందుకు సాగి రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ప్రార్ధించినట్లు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ సాగునీటి కోసం చేసిన భగీరథ ప్రయత్నం కొనసాగి ప్రాజెక్టులున్ని పూర్తై రైతులకు సాగునీరు అందాలని ప్రార్ధించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే హరీష్ రావుకు వేదాశీర్వాదం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

WhatsApp Image 2024 03 08 at 4.40.39 PM

SAKSHITHA NEWS