SAKSHITHA NEWS

ఉత్తమ పౌరులుగా ఎదగాలి:జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్

విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, సామాజిక సేవ కలిగి ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అన్నారు. మంగళవారం గద్వాల జిల్లాలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో 77వ ఎన్ సి సి వార్షిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ బి. ఎం.సంతోష్ హాజరయ్యారు. ఎన్ సి సి విద్యార్థుల కవాతు, గౌరవ వందనంతో జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్, ఇంచార్జ్ విద్య శాఖ అధికారి కాంతమ్మకు ఘన స్వాగతం పలికి అతిథులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోనే అత్యధిక విద్యార్థిని విద్యార్థులలు కలిగిన పాఠశాల అని, ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ఎన్ సి సి యూనిట్లు ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు
క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు సామాజిక సేవలో భాగస్వాములు అయ్యేలా తయారు చేయడానికి ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలని అన్నారు.

సామాజిక సేవా కార్యక్రమాలలో ఎన్ సి సి విద్యార్థుల పాత్ర చాలా గొప్పదని చదువుతో పాటు చక్కటి క్రమశిక్షణ గల ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎన్ సి సి ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం దేశ రక్షణలో భాగంగా త్రివిధ దళాలకు అనుబంధంగా పాఠశాల స్థాయిలో యూనిట్లను ఏర్పాటు చేసి వారికి కర్తవ్యం, ఐక్యమత్యం, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్ది దేశ సంఘటిత శక్తులలో ఒకటిగా ఉండటానికి కృషి చేయాలని, యుద్ద సమయాలలో రెండవ రక్షణ శ్రేణిగా సేవలు అందించడం మరియు వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా జీవితంలో ఉత్తమ పౌరులుగా తయారై సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు. మీ లక్ష్యాలను మరవకుండా నిరంతరం సాధనతో విజేతలు కావాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా ఇంటర్ డిగ్రీ కాలేజీలలో కూడా ఎన్ సి సి యూనిట్లను ప్రారంభించాలని విద్యార్థులందరూ అందులో పాల్గొనేటట్లు చూడాలని ఆయన అన్నారు. మీకు భవిష్యత్ లో ఎన్ సి సి కోట కింద ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద మరుగుదొడ్లకు గాను లక్ష రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.

  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట నరసయ్య, సి టీ ఓ రాముడు, రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు, పూర్వపు ఎన్ సి సి ఆఫీసర్లు, సెక్యూరిటీ ఆఫీసర్, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS