SAKSHITHA NEWS

పుట్టపర్తి : ‘ అతుకుల బొంత.. రోజూ చింత’ తరహాలో పెద్దల స్థాయిలో బీజేపీ – జనసేన – టీడీపీ కలిసినా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ఏ పార్టీ అభ్యర్థి బరిలో నిలిచినా మిగిలిన రెండు పార్టీల నుంచి సహకారం కరువవుతోంది. ఓ వైపు అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది. కానీ టీడీపీ- బీజేపీ- జనసేన కూటమి ఇంకా కొన్ని స్థానాలను పెండింగులోనే ఉంచింది. ఫలితంగా మూడు పార్టీల నుంచి ఆశావహులు తెరపైకి వస్తున్నారు. టికెట్‌ ఆశించి భంగపడే పరిస్థితి ఎదురవుతున్న సందర్భంలో వర్గాలు ఏర్పడుతున్నాయి.

ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ సీటు పంచాయితీ ఇంకా తేలనే లేదు. ఓ వైపు బీజేపీ తరఫున తనకే వస్తుందని వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) చెబుతున్నారు. మరోవైపు టీడీపీకే కేటాయించాలని, పరిటాల శ్రీరామ్‌ బరిలో ఉండాలని ఆయన వర్గీయులు ర్యాలీలు చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య గ్యాప్‌ పెరిగింది. ఫలితంగా ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు పోటీలో ఉన్నా మరో వర్గం వ్యతిరేకంగా పనిచేయడం ఖాయమని భావిస్తున్నారు.

ఎంపీ అభ్యర్థి కోసం వెతుకులాట

హిందూపురం పార్లమెంటు సీటు బీజేపీకి ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది. బీజేపీ నేత పరిపూర్ణానంద స్వామి కొన్ని రోజుల పాటు ప్రచారం కూడా చేశారు. అయితే టీడీపీనే పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా టీడీపీ నుంచి నిమ్మల కిష్టప్ప, అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి టికెట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. ఆ ముగ్గురిలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా మిగతా ఇద్దరూ సహకరించని పరిస్థితి. అంతేకాకుండా టికెట్‌ ఇవ్వని పక్షంలో నిమ్మల కిష్టప్ప స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి టీడీపీని ఓడించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో ఎంపీ సీటు ఎవరికి ఇవ్వాలనే దానిపై టీడీపీ అధిష్టానం ఫోన్‌ కాల్స్‌ సర్వే మొదలుపెట్టింది.

పుట్టపర్తి సీటు మార్పు ?

పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్‌ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డికి ఇచ్చారు. అయితే ప్రచారం తొలిరోజునే ఎండవేడిమిని తట్టుకోలేక ఆస్పత్రిలో చేరారు. మరోవైపు సమర్థులకే ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించాలని వడ్డెర సంఘం నాయకులు చంద్రబాబు నాయుడు వద్ద డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో టికెట్‌పై చంద్రబాబు, లోకేశ్‌ పునరాలోచన చేస్తున్నట్లు తెలిసింది. పల్లె సింధూరరెడ్డి స్థానంలో పల్లె రఘునాథరెడ్డికే ఇస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ‘పల్లె’ కుటుంబంలో ఎవరికి ఇచ్చినా బీసీ సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత రావడం ఖాయమని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు .

‘ తమ్ముళ్ల’ మండిపాటు

అభ్యర్థుల ప్రకటన విషయంలో చంద్రబాబు, లోకేశ్‌ వైఖరిపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. సీనియర్‌ నాయకులను సంప్రదించకుండా అభ్యర్థులను ప్రకటించడం సరికాదని విమర్శిస్తున్నారు. మరోవైపు బీసీ సామాజిక వర్గాలను విస్మరించి సొంత సామాజిక వర్గానికే టీడీపీలో పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి .

WhatsApp Image 2024 03 18 at 5.43.37 PM

SAKSHITHA NEWS