Dharma war.. Telangana is ready
ధర్మ యుద్ధం.. తెలంగాణ సిద్ధం
బారత రాష్ట్ర సమితి ఉద్యమాల గుమ్మం ఖమ్మం నుంచి కదనశంఖం పూరించనున్నది. తాము తప్ప దేశానికి మరే ప్రత్యామ్నాయమూ లేదని విర్రవీగుతున్న బీజేపీని నిలువరించే సత్తా బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉన్నదని బుధవారం ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభ నిరూపించనున్నది.
బీఆర్‌ఎస్ తొలి బహిరంగ సభ
రానున్న జాతీయ నేతలు.. దేశం చూపు ఖమ్మం వైపు బీఆర్‌ఎస్
ధూంధాంచలో ఖమ్మం
విపక్ష ఐక్యతకు సంకేతంగా నిర్వహణ
ఉత్తర-దక్షిణ సంగమ ప్రతీకగా సభావేదిక
ముగ్గురు సీఎంలతోపాటు పలువురు మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ, వామపక్ష నేతలు
తెలంగాణ మాడల్, రైతు ఎజెండాపై ఆసక్తి
దేశం కోసం ఇప్పటికే ‘టాక్ ఆఫ్ ది నేషన్’గా మారిన బీఆర్‌ఎస్‌తో జతకట్టేందుకు ఆసేతు హిమాచలం ఆశగా ఎదురుచూస్తున్నది. ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయి విజయన్‌తోపాటు అఖిలేశ్ యాదవ్, డీ రాజా లాంటి పలువురు జాతీయస్థాయి నేతలు ఖమ్మం అరుదెంచి తెలంగాణ తెగువను, కేసీఆర్ నమూనాను స్వయంగా వీక్షించనున్నారు.
ఆయన ఉద్యమ సూరీడు.. అది ఉద్యమాల పురిటిగడ్డ. తరాల అణచివేత నుంచి తెలంగాణ జాతిని విముక్తం చేసిన కేసీఆర్ మరో బృహత్తర ఉద్యమానికి సంకల్పించారు. విద్వేష శక్తుల చెర నుంచి, అసమర్థ పాలకుల బారినుంచి భారతమాతను విడిపించేందుకు కంకణం కట్టుకున్నారు. ఖమ్మం వేదికగా శంఖారావం పూరించబోతున్నారు.
భారత రాష్ట్ర సమితి ఉద్యమాల గుమ్మం ఖమ్మం నుంచి కదనశంఖం పూరించనున్నది. తాము తప్ప దేశానికి మరే ప్రత్యామ్నాయమూ లేదని విర్రవీగుతున్న బీజేపీని నిలువరించే సత్తా బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉన్నదని బుధవారం ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభ నిరూపించనున్నది.
టీఆర్‌ఎస్ నుంచి జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత సొంతగడ్డ తెలంగాణపై నిర్వహిస్తున్న తొలి సభ ఇదే. దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోగల సత్తా ఉన్న పార్టీ కోసం ఎదురుచూస్తున్న దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ఆశాకిరణంలా దర్శనమిచ్చింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం వేదికగా దేశగతిని మార్చే కార్యాచరణను ప్రకటించనున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొన్నది.
ఈ క్రమంలో ఖమ్మం బహిరంగసభకు సీఎం కేసీఆర్, మరో ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ సీఎం, సీపీఐ, సీపీఎం పార్టీల ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. ఆప్ జాతీయ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సహా పలు పార్టీల ప్రతినిధులు భారీ ఎత్తున ఖమ్మం బహిరంగ సభకు తరలివస్తున్నారు.
ఉత్తర, దక్షిణ వారధిగా సభావేదిక
ఉత్తర, దక్షిణ భారతాలకు ఖమ్మం బహిరంగ సభ వేదిక కానున్నది. ఉత్తర భారత రాష్ర్టాలైన యూపీ, పంజాబ్, ఢిల్లీ నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక మాజీ సీఎం.. దక్షిణభారత రాష్ర్టాలైన తెలంగాణ, కేరళ నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు, పార్టీ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ర్టాల నుంచి జాతీయ నాయకులు, వివిధ రంగాల ప్రతినిధులతో ఖమ్మం సభ భారత రాజకీయ చరిత్రలో చరిత్ర సృష్టించనున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఏది చేసినా దానికో సైద్ధాంతిక, తాత్విక దృక్పథం ఉంటుందని.. ఈ క్రమంలోనే ఖమ్మం సభలో జాతీయ పార్టీ విధివిధానాలను ప్రకటిస్తారని అభిప్రాయపడుతున్నారు.
రైతు ఎజెండా.. సకలజనుల పండుగ
కేంద్రంలో బీజేపీ పాలన సాగిస్తున్న అప్రజాస్వామిక విధానాలను బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అడుగడుగునా ఎండగడుతున్నారు. ‘అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని బీఆర్‌ఎస్ ఎత్తుకున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయ విప్లవం దేశానికి ఆదర్శంగా నిలిచింది.
రైతుబంధుతో స్ఫూర్తిపొందిన కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని చేపట్టడం, మిషన్ భగీరథ స్ఫూర్తిగా ‘హర్‌ఘర్ జల్’ పథకాన్ని తేవటం, మిషన్ కాకతీయను కాపీ కొట్టి ‘అమృత్ సరోవర్’ అమలు చేయటం.. ఇలా పలు తెలంగాణ పథకాలను కేంద్రం, రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ఎత్తిపోతల పథకాలతో ప్రతి ఎకరాకు సాగునీటిని రాష్ట్రప్రభుత్వం అందిస్తున్నది.
రైతుబంధు ద్వారా రూ.65 వేల కోట్లను పెట్టుబడి సాయంగా కేసీఆర్ ప్రభుత్వం అందించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ వ్యవసాయ రంగం.. నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరింది. దళితబంధుతో దళితులను వ్యాపారవేత్తలుగా రాష్ట్ర ప్రభుత్వం మారుస్తున్నది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న ఖమ్మం బహిరంగసభపై జాతీయస్థాయిలో ఆసక్తి నెలకొన్నది.
బీఆర్‌ఎస్ భారీ బలప్రదర్శన
బుధవారం ఖమ్మంలో నిర్వహించే బీఆర్‌ఎస్ బహిరంగ సభ దేశంలో బీజేపీయేతర పార్టీల బలానికి, బీఆర్‌ఎస్ నిర్మాణశక్తికి వేదికగా నిలువనున్నది. బీఆర్‌ఎస్ వెంట వస్తున్న ఎస్పీ, ఆప్, సీపీఐ, సీపీఎం సహా అనేక పార్టీలను ఏకం చేయగల సత్తా సీఎం కేసీఆర్‌కు ఉన్నదని దేశంలో జరుగుతున్న పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. మోదీని నిలువరించటమే కాకుండా దేశ ప్రజల యోగక్షేమాల కోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకత్వ పటిమ కేసీఆర్‌లోనే ఉందని బీజేపీయేతర పార్టీలు విశ్వసిస్తున్నాయి.
సభకు భారీ బందోబస్తు..
పర్యవేక్షణకు ఏడుగురు ఐపీఎస్‌లు: డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) బహిరంగసభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు సీఎం కేసీఆర్‌తోపాటు మూడు రాష్ర్టాల సీఎంలు, యూపీ మాజీ సీఎం, ఇతర ముఖ్య నేతలు రానున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రత చర్యలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా బందోబస్తు ఏర్పాట్ల పర్యవేక్షణకు ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమిస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 18న సీఎం కేసీఆర్ ముందుగా ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను, తరువాత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
అనంతరం మెడికల్ కళాశాలకు శంకుస్థానన చేస్తారు. అనంతరం బీఆర్‌ఎస్ బహిరంగ సభలో పాల్గొంటారు. కలెక్టరేట్ ప్రారంభం, బహిరంగ సభ బందోబస్తును వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యవేక్షిస్తారు. రూట్ బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్ ప్రాంతాలతోపాటు లా అండ్ ఆర్డర్ వంటి వాటిని మల్టీజోన్-2 ఐజీపీ షానవాజ్ ఖాసీం పర్యవేక్షిస్తారు.
మొత్తం కార్యక్రమ ఇన్‌చార్జులుగా మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ వ్యవహరించనున్నారు. ఐజీపీ షానవాజ్ ఖాసీం నిర్వహించే కార్యక్రమాలకు గద్వాల జోగులాంబ జోన్ డీఐజీ చౌహన్‌ను సహాయకుడిగా నియమించారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి నిర్వహించే విధులకు రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీ కే రమేశ్‌నాయుడు సహాయకుడిగా ఉంటారు. అవసరమైన బందోబస్తు బృందాలను అడిషనల్ డీజీపీ విజయ్‌కుమార్ ఏర్పాటు చేస్తారు. వీరంతా సోమవారం నుంచే ఖమ్మంలో విధులు నిర్వర్తించాలని డీజీపీ ఆదేశించారు.