చెవుటూరులో సచివాలయం భవనం ప్రారంభం.
భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
జి.కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో రూ.43.60 లక్షల నిధులతో నిర్మించిన సచివాలయ భవనాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు.
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ
“పాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సేవలను సత్వరం అందించాలనే ప్రధాన లక్ష్యంతో దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చింది.
ఇందుకోసం గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు ముమ్మరంగా చేపట్టింది. అవినీతికి కానీ, వివక్షతకు కానీ తావు లేని పరిపాలన ప్రజలకు చేరువ కావాలన్నదే ఏపీ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. మైలవరం నియోజకవర్గంలో దాదాపు 200కి పైగా భవన నిర్మాణాలు పూర్తి చేసి గ్రామాలకు, పట్టణాలకు శాశ్వత ఆస్తులు కూడబెట్టాం. అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దాదాపుగా 536 సేవలను అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతిపనికి సుదూర ప్రాంతాల్లో ఉండే మండల కార్యాలయాలకు వెళ్ళకుండా సచివాలయాల్లోనే సేవలు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రజల విలువైన సమయం, సొమ్ము ఆదా అవుతుంది. జవాబుదారీతనంతో కూడిన సేవలు లభ్యమవుతున్నాయి.” అని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.