Development is possible with widening of roads - Deputy Mayor Bhumana Abhinay
రోడ్ల విస్తరణతో అభివృద్ది సాధ్యమవుతుంది – డిప్యూటీ మేయర్ భూమన అభినయ్
సాక్షిత తిరుపతి: రోడ్ల విస్తరణతో ఏ ప్రాంతమైన శరవేగంగా అభివృద్ధి చెందడం జరుగుతుందని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు.
తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ ముందర పరిసరాలను సోమవారం భూమన అభినయ్ రెడ్డి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ తిరుపతి నగరాభివృద్ధికి అవసరమైన 12 మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులను ఇప్పటికే అత్యంత వేగవంతంగా అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు.
ఏరియా డెవెలప్‌మెంట్లో భాగంగా తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ ముందర నుండి తూర్పు వైపుగా ఎస్వీ క్యాంపస్ స్కూల్ వెనుకవైపుగా క్యాంపస్ స్కూల్ రోడ్డులో కలిసేలా 60 అడుగుల రోడ్డును అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే వెస్ట్ రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు అదేవిధంగా వెస్ట్ రైల్వే స్టేషన్ వద్దనున్న రైల్వె క్వార్టర్స్ ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా వుంటుందన్నారు.
తిరుపతి నగరంలో అందరికి అందుబాటులో వుండే అతి పెద్ద ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో పెద్ద స్థాయిలో జరిగే క్రీడలకు, సభలకు వచ్చే క్రీడాకారులకు, ప్రజలకు ఈ నూతన రహదారి వలన చాలా మేలు జరుగుందన్నారు. అదేవిధంగా ప్రీ లెప్ట్ ల గురించి భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ బాలాజీకాలనీ మ్యూజిక్ కళాశాల ముందర నుండి వెస్ట్ చర్చ్ వైపు వెల్లె రహదారిలో ప్రీ లెప్ట్ ను టిటిడి వారి సహకారంతో తీసుకురావడం జరుగుతుందని, ఇటివలనే క్యాంపస్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రీ లెప్ట్ వలన వాహనదారులకు చాలా ప్రయోజనం చేకూరిందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, హనుమంత్ నాయక్, నరసింహాచారి, నాయకులు రఘునాధ్ రెడ్డి, మబ్బు నాధమునిరెడ్డి, చంద్ర తదితరులు పాల్గొన్నారు