తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి ఏడుకొండలు ఘాటు విమర్శలు
విజయవాడ, : వైసీపీలో బీసీ నేతలకు ప్రజలకు గౌరవం లేదని, రానున్న ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓటమి చెందటం ఖాయమని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సాదరబోయిన ఏడుకొండలు ఘాటుగా విమర్శించారు.గురువారం మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల ముందు వైసీపీ బీసీ నేతలు బానిసలుగా తలవంచుకునీ బతుకుతున్నారని అన్నారు. త్వరలోనే బీసీ ఎంపీ డాక్టర్ సంజీవ్ లాగా కొద్ది రోజుల్లో పలువురు బీసీ నేతలు వైసిపికి గుడ్ బై చెప్పనున్నారన్నారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో జనాభాలో 60 శాతం ఉన్న బీసీ సామాజిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని, జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదని ఘాటుగా విమర్శించారు.
బీసీ యువతకు సరైన విద్యా ప్రోత్సాహకాలు అందడం లేదని , కొత్త పరిశ్రమలు రావడంలేదని,రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు అన్నిటిని జగన్ రెడ్డి చిన్నాభిన్నం చేసేసారని, వైసీపీ అరాచకత్వానికి హద్దు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో బీసీలకు రాజకీయ భవిష్యత్తు లేదని, పార్టీ మొత్తం ఒకే సామాజిక వర్గం అధీనంలో ఉందని ఏడుకొండలు విమర్శించారు. వైసీపీ పాలనలో 200 మంది బీసీలను హత్యలు చేశారని, బీసీలకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి రిజర్వేషన్లను తగ్గించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో 17 వేల మంది బీసీలను పదవులకు దూరం చేశారని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, తెలుగుదేశం లోనే బీసీలకు తగిన గౌరవం ఉందని ఆయన చెప్పారు. సమావేశంలో తెలుగుదేశం నాయకులు గణపా రాము మాట్లాడుతు జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని విమర్శించారు. వైసీపీ పాలన లో రాష్ట్రంలో అభివృద్ధి లేదని, అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడిందని విమర్శించారు. రానం ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.సమావేశంలో టిడిపి నాయకులు రాజగిరి అశోక్, బి. సత్తిబాబు, జి . సుధాకర్ తదితరులు పాల్గొన్నారు