- జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు
విజయవాడ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్వావలంబన సాధించేలా వారి జీవన ప్రమాణాలను పెంచడమే జైభారత్ నేషనల్ పార్టీ లక్ష్యమని పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అవసరమైతే ప్రభుత్వానికే ప్రజలు సాయం అందించేలా, కులమతాలకు అతీతంగా, ప్రజా ప్రగతిని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రముఖ న్యాయవాది, బహుజన సమాజ్ పార్టీ నాయకుడు లంకా కరుణాకర్ దాస్ జైభారత్ నేషనల్ పార్టీలో జేడీ లక్ష్మీనారాయణ సమక్షంలో చేరారు. ఆయనతోపాటు పలువురు దళిత, క్రిస్టియన్ నాయకులు పెద్ద ఎత్తున జైభారత్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయవాడలోని కేసీ ఫంక్షన్ హాలులో జరిగిన సభలో జేడీ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను, బడుగుబలహీన వర్గాలను పైకి తేవడమే తమ ముందున్న లక్ష్యం అన్నారు. అందుకే, డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ కు జైభారత్ నేషనల్ పార్టీలో ఉపాధ్యక్ష పదవి ఇచ్చి ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. భయపడకు.. నిన్ను పేరు పెట్టి పిలిస్తున్నా… అంటూ, బైబిల్ వాక్యాన్ని ఉటంకించిన జేడీ లక్ష్మీనారాయణ అవినీతి, విధ్వంసం, డ్రగ్స్, రౌడీయిజం లేని ఆంధ్రపదేశ్ కావాలన్నారు. తనకు పలు రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు, ఒత్తిడులు ఉన్నా నిజాయితీ కలిగిన జేడీ లక్ష్మీనారాయణ సారధ్యం వహిస్తున్న జైభారత్ నేషనల్ పార్టీలో తాను చేరారని డాక్టర్ లంకా కరుణాకర్ చెప్పారు. ఆర్ధిక బానిసత్వం నుంచి విముక్తి కోసం ప్రజలంతా జై భారత్ పార్టీని బలపరచాలని లంకా కరుణాకర్ పిలుపునిచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా తన క్రిస్టియన్ సంస్థ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించిన తాము, రాష్ట్రంలోని 676 మండలాల్లో ఉపాధి కల్పన, మహిళల ఉన్నతి కార్యక్రమాలను చేపడతామన్నారు. జైభారత్ ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు మాట్లాడుతూ, ఏపీలోని అన్ని పార్టీలు ప్రత్యేక హోదా సాధించే ప్రయత్నాన్ని చిత్తశుద్ధిగా చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో లక్కెపోగు భాస్కర్, చాట్ల రాజశేఖర్, కిశోర్, గురివిందపల్లి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎ లేజర్, అశోక్ బాబు, నిర్మల, కుమారి తదితర దళిత క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు చెందిన నేతలు జైభారత్ నేషనల్ పార్టీలో చేరారు.
జైభారత్ నేషనల్ పార్టీ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ లంక కరుణాకర్ దాస్
జైభారత్ నేషనల్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా డాక్టర్ లంక కరుణాకర్ దాస్ ను నియమిస్తూ, పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ప్రకటన చేశారు. బి.ఎస్.పి. నాయకుడిగా, అడ్వకేట్ గా, క్రిస్టియన్ సంఘాల ప్రతినిధిగా ఉన్న కరుణాకర్ కు దళితుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ఈ పదవి కల్పించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లంక కరుణాకర్ పార్టీ కార్యక్రమాలు విస్తృత పరిచేలా పనిచేయాలని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు.