SAKSHITHA NEWS

రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక..
సమావేశంలో రాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులు, నిఘా వర్గాలు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

రానున్న పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేందుకు ఇరు రాష్ట్రాల పోలీసులు సమిష్టి కృషితో ముందుకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలంగాణ,ఆంద్రరాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులు తెలిపారు.
రాష్ట్ర సరిహద్దు పోలీసుల మధ్య భద్రతా ఏర్పాట్లపై మైలవరం ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన
సమీక్ష సమావేశంలో మైలవరం ఏసీపీ యస్. మురళీ మోహన్, నందిగామ ఏసీపీ డా,బి. కిరణ్ కుమార్, ఏస్బీ ఏసీపీ పార్ధసారధి (కృష్ణ జిల్లా) ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, కల్లూరు ఏసీపీ రఘు, వైరా ఏసీపీ రహెమాన్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్న కుమార్, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంద్ర రాష్ట్ర సరిహద్దు జిల్లాలుగా ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఇరు రాష్ట్రాల సమన్వయంగా పని చేసి, సరిహద్దుల వద్ద పటిష్టమైన భద్రత చర్యలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మద్యం,నగదు నియంత్రణ పై చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులు చర్చించారు. ప్రధానంగా అంతరాష్ట్ర, అంతర్ జిల్లా పోలీస్ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలలో 24/7 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సరిహద్దులో పటిష్ట నిఘా పెట్టడంతో పాటు మద్యం, నగదు సరఫరాపై నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రణకు
ఇరు రాష్ట్రల పోలీసులు పరస్పరం సమాచార మార్పిడితో కట్టడి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎన్నికల నియమావళి పరిరక్షణే ధ్యేయంగా సరిహద్దు పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.


నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ విషయంలో ఇరు జిల్లాల, రాష్ట్రాల అధికారులు సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. పాత దొంగలు, నేరస్తుల సంచారం కట్టడి, ఇంటలిజెన్స్ సమాచారం పంచుకోవడం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. గతంలో అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని, వారిని నియంత్రించడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. సరిహద్దులో హైవే పెట్రోలింగ్‌, మొబైల్‌ పెట్రోలింగ్‌ పెంచాలని, పోలీస్‌ అధికారులు వాట్సప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా సరహద్దుల్లో ఉన్న సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా చెక్‌ పోస్టులను సంబంధిత అధికారులు ఏర్పాటు చేసుకొని నిరంతరాయంగా తనిఖీలు చేపట్టాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

WhatsApp Image 2024 03 14 at 5.45.37 PM

SAKSHITHA NEWS