Conquer TWJF State Congress on 27th
27న టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొండల్ రావు, శ్రీనివాసరెడ్డి
జిల్లా సమావేశం.. కరపత్రం ఆవిష్కరణ
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
ఈనెల 27న హైదరాబాద్ లోని ఆర్టీసీ కళాభవన్ లో నిర్వహించే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పల్లా కొండలరావు, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.
అదే రోజు ఉదయం 10 గంటలకు బాగ్ లింగంపల్లి నుంచి నిర్వహించే జర్నలిస్టుల మహా ప్రదర్శననూ జయప్రదం చేయాలని కోరారు. ఈ మేరకు ఖమ్మంలోని మంచికంటి భవన్ లో శనివారం నిర్వహించిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించారు.
రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై టీడబ్ల్యూజేఎఫ్ అలుపెరుగని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. కార్పొరేట్ల గుప్పిట్లో మీడియా చిక్కుకున్న నేపథ్యంలో జర్నలిస్టులు, ఉద్యోగుల తీసివేత ప్రారంభమైందన్నారు. జర్నలిస్టులపై దాడులు కూడా పెరిగాయని అన్నారు
. ప్రభుత్వాలు మీడియాపై ఆంక్షలు పెడుతున్నాయని తెలిపారు. ప్రజల కోసం జర్నలిస్టులు తమ వృత్తిని నిర్వహించడం కష్టతరంగా మారిందని వాపోయారు. ఓవైపు జర్నలిస్టులు ఆర్థిక, మానసిక సమస్యలను ఎదుర్కొంటూనే మొక్కోవని దీక్షతో విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు
. ఈ నేపథ్యంలో పోరాటాలు, ఫలితాలను విశ్లేషించుకొని ముందడుగు వేసేందుకు ఫెడరేషన్ ప్రయత్నిస్తున్నదన్నారు. ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు రైల్వేపాసులు, బస్సు పాసులు, తదితర సమస్యలపై టీడబ్ల్యూజేఎఫ్ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేస్తుందన్నారు.
ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణలో అక్రిడిటేషన్ లు పెరిగిన మాట వాస్తవమే అయినా చిన్న, మధ్యతరహా పత్రికలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని తెలిపారు. ఇండ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు కేసును ప్రభుత్వం అడ్డంకిగా చూపిస్తోందని…ఫెడరేషన్ కృషి ఫలితంగా ఉన్నత న్యాయస్థానం జర్నలిస్డులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు.
ఈ రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సాతుపాటి రాము, జిల్లా కార్యవర్గ సభ్యులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు, మోహన్ రావు, అంజయ్య, శ్రీధర్, విష్ణు, ఆర్. శ్రీను, కేఆర్ కుమార్, అంజి పాల్గొన్నారు.