SAKSHITHA NEWS

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సాధారణతోపాటు ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నవారిని కూడా మహాలక్ష్మి పథకం కిందికి తీసుకువస్తోంది. అయితే పథకం లబ్ధిదారులు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌరసరఫరాలశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత రూ.500కు అదనంగా చెల్లించిన ధరను ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) ద్వారా రీయింబర్స్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.40 రాయితీని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర రూ.955 ఉంటే.. వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.40 పోను మిగతా రూ.415ని రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని సమాచారం.

ఉజ్వల’ రాయితీ పోను మిగతా మొత్తం చెల్లింపు

హైదరాబాద్‌లో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.955. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో రూ.974. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో రూ.958.50. నారాయణపేట జిల్లా ధన్వాడలో రూ.973.50. ఇలా రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఒక్కోచోట ఒక్కో ధర ఉంది. రవాణా ఛార్జీల వ్యత్యాసమే ఇందుకు కారణం. రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు 11.58 లక్షలు ఉండగా, వీరికి కేంద్రం నుంచి సిలిండర్‌కు రూ.340 రాయితీ వస్తోంది. మహాలక్ష్మిలో ఎంపికైన గ్యాస్‌ వినియోగదారులు సిలిండర్‌పై చెల్లించే ధరలో కేంద్ర రాయితీ పోను.. మిగతా మొత్తం రూ.500 కంటే ఎంత అధికంగా ఉంటే అంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనున్నట్లు సమాచారం. ఉదాహరణకు సిలిండర్‌ ధర రూ.970 ఉందనుకుంటే వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.340 పోను రూ.130ని రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా జమ చేస్తుంది. దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలతో సిలిండర్‌ ధర అదనంగా ఉన్నా ఆ భారం ప్రజలపై పడొద్దని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఓఎంసీలతో సమావేశం

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎంసీ)లతో ఆదివారం మధ్యాహ్నం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘మహాలక్ష్మి’ కింద గ్యాస్‌ పథకాన్ని ఈ నెల 27న ప్రారంభించనున్నట్లు అధికారులు ఓఎంసీలకు తెలిపారు. జిల్లాల వారీగా పథకం లబ్ధిదారుల జాబితాను ఓఎంసీలకు సోమవారం ఇవ్వనున్నట్లు సమాచారం. అప్‌ఫ్రంట్‌(అడ్వాన్సు) మొత్తాన్ని కూడా చెల్లించనుంది. ఈ మేరకు రూ.80 కోట్ల విడుదలకు అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులకు ఇచ్చే సిలిండర్ల సంఖ్యను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ మొత్తం ఎప్పటికప్పుడు ఆయిల్‌ కంపెనీలకు చేరేలా ఏర్పాట్లు చేస్తోంది.

WhatsApp Image 2024 02 26 at 7.15.22 PM

SAKSHITHA NEWS