Condemning ED and IT attacks: MP Ravichandra
ఈడీ, ఐటీ దాడులను ఖండిస్తున్న:ఎంపీ రవిచంద్ర
కష్టాలలో ఉన్న,నష్టాల బారినపడిన గ్రానైట్ పరిశ్రమనుఆదుకోవాల్సిందిగా ప్రధాని మోడీ కి విజ్ఞప్తి:ఎంపీ రవిచంద్ర
గ్రానైట్ పరిశ్రమ మాఫియా కాదు,జీరో వ్యాపారం కాదు, వేలమందికి ఉపాధి కల్పిస్తున్నం:ఎంపీ రవిచంద్ర
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
గ్రానైట్ కంపెనీల కార్యాలయాలపై ఈడీ, ఐటీలు జరిపిన దాడులను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు.తన కుటుంబ సభ్యులు,దగ్గరి బంధువు గంగుల కుటుంబానికి సంబంధించిన గాయత్రి, శ్వేత గ్రానైట్ కంపెనీలపై ఈడీ,ఐటీలు దాడులకు దిగడం శోచనీయమన్నారు.వాస్తవంగా ఈ పరిశ్రమతో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని,తమకు ఎటువంటి రాయితీలు ఇవ్వలేదని,ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి మాత్రమే వస్తుందని వివరించారు.
కరోనా మహమ్మారి కారణంగా మార్కెట్ దారుణంగా దెబ్బతిని గ్రానైట్ పరిశ్రమ తీవ్ర కష్టాలలో ఉందని,నష్టాల బారిన పడిందని తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ రవిచంద్ర చెప్పారు.ఈ పరిశ్రమలో జీరో వ్యాపారం అనే మాటే లేదని, పారదర్శకతతో, నిజాయితీగా వ్యాపారం చేస్తున్నామని తెలిపారు.
ఈడీ,ఐటీ అధికారులు జరిపే విచారణకు తాము పూర్తి సహకారం అందిస్తామని,24గంటలు అందుబాటులో ఉంటామని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.వందల మందికి ఉద్యోగాలిచ్చి,వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న,75%శాతం నష్టాల బారినపడి ఇబ్బందులు పడుతున్న గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి రవిచంద్ర విజ్ఞప్తి చేశారు