SAKSHITHA NEWS

యోగ జీవితానికి ప్రాణవాయువు లాంటిది
జిల్లాలో ప్రశంసలు అందుకుంటున్న అరవింద ఉచిత యోగ ట్రస్ట్
అంతర్జాతీయ యోగా దినోత్సవం
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ప్రాణవాయువును ఒడిసిపట్టి జీవనశైలిని కొనసాగించేందుకు యోగ ఒక అద్భుతమైన ప్రాణవాయువుగా ప్రపంచాన్ని చుట్టేసింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకొని వేడుకలు దేశ దేశానా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఖమ్మం నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న “అరవింద ఉచిత యోగ ట్రస్ట్” గత అనేక ఏండ్లుగా వేలాదిమందికి ఉచిత యోగాను ఇస్తూ ప్రశంసలు పొందుతుంది. యోగ నిర్వహకులు బండి ఉష – దండ లక్ష్మణరావు దంపతులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా పని చేస్తున్నప్పటికీ ప్రతిరోజు వందలాది మందికి ఆన్లైన్లో, ప్రత్యక్షంగా యోగాసనాలు వేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు యోగా కేంద్రంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం అనేక రుగ్మతల నుంచి బయటపడేందుకు యోగ ఎంతో ఉపయోగపడుతుంది. మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, నరాల బలహీనత, బిపి, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ తగ్గుదల వంటి తదితర అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి శారీరక శ్రమతో బయటపడేందుకు అనునిత్యం ‘అరవింద యోగ ట్రస్టు’లో ఉచితంగా శిక్షణ పొందేందుకు వెసులుబాటు కల్పించడం అభినందనీయం.

ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి దాదాపు రెండు గంటల పాటు వివిధ భంగిమలలో యోగాసనాలు చేయిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.. ఆ దంపతులు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. పలువురికి ‘యోగా’ ద్వారా సేవ చేయాలన్న సంకల్పంతో బండి ఉష – దండ లక్ష్మణరావులు ఉపాధ్యాయులుగా ఉంటూ ట్రస్టు ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులకు ఫీజులు, నోటు పుస్తకాలు అందివ్వడం, వృద్ధులకు వస్త్ర దానం, పేదలకు అన్నదానం వంటి కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు 200 మందికి ఆన్లైన్ ద్వారా, మరో 100 మందికి ప్రత్యక్షంగా యోగాసనాలు ఇస్తూ ప్రశంసలు పొందుతున్నారు.
బండి ఉష – దండ లక్ష్మణరావు దంపతులిద్దరూ కవిత్వం, రచనలు సాహిత్యంలో ప్రావీణ్యం పొందారు. కవిత్వంలో బండి ఉష ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు’లో పేరు నమోదు కావడంతోపాటు అనేక అవార్డులు వరించడం విశేషం. వారు ఇప్పటికే అనేక పుస్తకాలు రాసి రాష్ట్రవ్యాప్తంగా పలువురు చేత ప్రశంసలు పొందారు.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే ట్రస్టులో సేవా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.


SAKSHITHA NEWS