వేణుస్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు…
హైదరాబాద్: సోషల్ మీడియాలో సినీ ప్రముఖులపై వ్యాఖ్యలు చేస్తూ ప్రఖ్యాతి పొందిన వేణుస్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెనుధుమారం లేపింది. వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్లు సోమవారం ఎంజీ రోడుల్డో బుద్ధభవన్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గతంలో సినిమా రిలీజ్‌లపై, రాజకీయ ఫలితాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి అబాసు పాలైనా బుద్ధి రాలేదని, అసలు వ్యక్తిగత విషయాలు నలుగురిలో మాట్లాడకూడదు అనే జ్ఞానం కూడా లేని వేణుస్వామి వాళ్లు ఎప్పుడు విడిపోతారో కూడా చెప్పేసాడని అన్నారు.
ఈ విషయంపై స్పందించిన నేరెళ్ల శారద వేణుస్వామిని పిలిలించి వివరణ అడుగుతామని, ఆయనపై, టెలికాస్ట్ చేసిన యూ ట్యాబ్ చానల్స్పైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి వై.జె.రాంబాబు, కోశాధికారి సురేంద్ర కుమార్ నాయుడు, ప్రసాదం రఘు, లక్ష్మి, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షురాలు వనం ప్రేమమాలిని, కార్యదర్శి వేదుల మూర్తి, సభ్యులు సువర్ణ, తేజస్విని, భాగ్య లక్ష్మి, కుమార్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు వనజ పాల్గొన్నారు..