గంగ జాతరకు పోటెత్తిన భక్తులు – ఎమ్మెల్యే భూమన
సాక్షిత : తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర రెండవ రోజు గంగమ్మకు సంప్రదాయబద్దంగా సారెను సమర్పించిన తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్, అనీల్ కుమార్ దంపతులు. సారె సమర్పణ కార్యక్రమంలో కమిషనర్ స్వగృహం నుండి హరిత, అనిల్ కుమార్ దంపతులు, వారి కుటుంబసభ్యులతో బాటు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి దంపతులు, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణ, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది ఆధ్యాంతం పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
తిరుపతి లీలామహల్ సర్కిల్ వద్ద కమిషనర్ ఇంటి నుంచి భారీ ఊరేగింపుగా మేళా తాళాలు, మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు నడుమ సారేను గంగమ్మకు సమర్పించిన మున్సిపల్ కమీషనర్ హరిత దంపతులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ గంగమ్మ జాతరలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తశ్రద్ధలతో పాల్గొంటున్నారని, తిరుపతి వాసైన నగరపాలక సంస్థ కమిషనర్ హరిత భక్తిశ్రద్దలతో, నిబద్దతతో అమ్మవారికి సారెను సమర్పించి మొక్కులు తీర్చుకోవడం అందరికి ఆదర్శనియమన్నారు. తిరుపతి గంగమ్మ జాతర, అమ్మవారికి బ్రహ్మోత్సవాలు తరహాలో జరుగుతున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా సంప్రదాయంగా గంగమ్మ జాతరలో సారె సమర్పించడం తమ అదృష్టమని, ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచార సంప్రదాయం కొనసాగిస్తున్నామన్నారు. తిరుపతి నగరంలో పుట్టినప్పటి నుండి ప్రతి సంవత్సరం గంగమ్మకు వేషాలు వేస్తూ, జాతర జరుపుకుంట్టున్నామని, ఈ సంవత్సరం తిరుపతి జాతరలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గా పాల్గొనడం అమ్మవారి కృపేనన్నారు. తిరుపతి నగర ప్రజలు అందరూ సంతోషంగా గంగమ్మ జాతరలో పాల్గొంటున్నారని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు