SAKSHITHA NEWS

సాక్షిత : తిరుపతి నగరంలో ఇప్పటి వరకు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన పిర్యాధులు, వారి ఏరియాల్లో అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించే విషయంలో, అదేవిధంగా నాడు నేడు కార్యక్రమంలో భాగంగ నిర్వహించాల్సిన పనుల విషయంలో అలసత్వం వహించకుండా పనులు పూర్తి చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు.

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాంబర్లో మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఇప్పటికే ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్లు పర్యటించిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరడం, వాటిపై మన ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి అవసరమైన పనులను చేపట్టెందుకు అనుమతులు తీసుకున్నా కూడా, పనులు చేపట్టకుండా ఆలస్యం చేయడంపై కమిషనర్ తీవ్రంగా స్పందిస్తూ వెంటనే ఆ పనులను పూర్తి చేయాలని ఆదేశాలు జరీ చేసారు. చేపట్టాల్సిన పనులపై మొదట సరైన అవగాహన పెంపొందించుకోవాలని సూచిస్తూ, క్రింది స్థాయి సిబ్బందిపై పైస్థాయి అధికారుల పర్యవేక్షణ నిరంతరం వుండేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

నాడు నేడు పనుల విషయంలో మన మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహణలోని 44 స్కూల్స్ నందు చేపట్టాల్సిన పెండింగ్ పనుల ఆలస్యంపై కమిషనర్ స్పందిస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాడు నేడు పనులను సకాలంలో పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. నగరంలో వదులుతున్న మంచినీరు సరఫరా విషయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగు సమయం కేటాయించాలన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఇంజనీరింగ్ అధికారులు సరైన శ్రద్ధ తీసుకోవాలని కమిషనర్ హరిత ఐఏఎస్ స్పష్టం చేసారు. ఈ సమిక్షా సమావేశంలో ట్రైని డిప్యూటీ కలెక్టర్ శ్రీలేఖ, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, రవీంధ్రరెడ్డి, సంజీవ్ కుమార్, మహేష్, మేనేజర్ చిట్టిబాబు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS