CM KCR participated in special pujas at Telangana Bhavan
తెలంగాణ భవన్‌లో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న సీఎం కేసీఆర్
బీఆర్‌ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. పూజలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
సీఎంతోపాటు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, సినీ నటుడు ప్రకాశ్ రాజ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మారింది. 21 ఏండ్ల అనుభవం, 60 లక్షల మంది సుశిక్షితులైన సైనికులు కలిసి భారతదేశ తలరాతను మార్చేందుకు నడుం బిగించారు. ‘తెలంగాణను ఏ విధంగానైతే అభివృద్ధి చేసుకొన్నామో..
అదే విధంగా దేశాన్ని బాగుచేసుకొనేందుకు కదులుదాం’ అని సీఎం కేసీఆర్ దసరా రోజు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘మన పార్టీ పేరు ఇకపై భారత రాష్ట్ర సమితి’ అని నాడు ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. పేరు మార్పును ఆమోదిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు గురువారం లేఖ రాసింది. దీంతో టీఆర్‌ఎస్ నేటి నుంచి బీఆర్‌ఎస్‌గా అవతరించింది.