CM KCR laid the foundation stone for the second phase of Metro
మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు గచ్చిబౌలి సమీపంలోని ఐకియా ఎదుట ఉన్న మైండ్‌స్పేస్ వద్ద పునాదిరాయి వేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రులు కేటీఆర్, మహముద్ అలీ, సబిత, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు కేశవరావు, రంజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైదరాబాద్ నగరానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.
31 కిలోమీటర్లు.. 26 నిమిషాల్లో
మెట్రో రెండోదశ విస్తరణలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు (31 కి.మీ.) వరకు కేవలం 26 నిమిషాల్లో ప్రయాణించేలా హైదరాబాద్ మెట్రో రైల్ ఏర్పాట్లు చేస్తున్నది. విమానాశ్రయానికి త్వరగా చేరేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. పిల్లర్లతోపాటు 2.5 కిలోమీటర్ల మేర భూగర్భంలో రైలు మార్గాన్ని నిర్మించనున్నది. అవుటర్ రింగ్‌రోడ్డు వెంట నిర్మించే ఈ మార్గంలో 120 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఎయిరో డైనమిక్ టెక్నాలజీని వినియోగించనున్నారు.
ప్రస్తుత మెట్రో స్టేషన్ల కంటే ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్లు క్లోజ్డ్ సర్క్యూట్‌తో ఉంటాయి. రైలు వచ్చినప్పుడే ప్లాట్‌ఫాం గేట్లు తెరుచుకొంటాయి. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 8-9 స్టేషన్లు ఉండనున్నాయని, కార్గో లైన్, ప్యాసింజర్ లైన్ వేర్వేరుగా ఉంటాయని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
మూడేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సీఎం కేసీఆర్ ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నారని ఆయన చెప్పారు.
హైదరాబాద్‌లో ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-మాదాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్ రూట్లలో మెట్రో ఇప్పటికే సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. వీటితోపాటు నగరంలోని మరిన్ని ప్రాంతాలకు మెట్రో సేవలు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో రెండోదశను ప్రారంభించనున్నది.
ఈ దశలో రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్‌పోర్టు (31కి.మీ), బీహెచ్‌ఈఎల్-లక్డీకాపూల్ (26 కి.మీ.), నాగోలు-ఎల్‌బీనగర్ (5 కి.మీ.) మొత్తం 62 కిలోమీటర్లు విస్తరించేందుకు డీపీఆర్‌లను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రూ.6,250 కోట్లతో రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులను చేపట్టింది. 31 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని మూడేండ్లలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.