SAKSHITHA NEWS

ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట…

వృద్ధులు, వికలాంగులకు ఆసరా పింఛన్ల‌తో ఆత్మగౌరవాన్ని కల్పించిన నాయకుడు కేసీఆర్…

సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామి…

బీజేపీ, కాంగ్రెస్‌లతో ఒరిగేదేమి లేదు…

నిజాంపేట్ లో 1,002 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1,002 మందికి నూతనంగా మంజూరైన కొత్త పింఛన్ కార్డులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ నిజాంపేట్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి , డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ మరియు కార్పొరేటర్లతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 10 లక్షల పింఛన్లతో మొత్తం 46లక్షల పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. నిర్లక్ష్యానికి గురయ్యే ఎంతో మంది వృద్ధులకు ఆసరా పింఛన్‌తో సీఎం కేసీఆర్‌ ఆత్మగౌరవాన్ని కల్పించారన్నారు. ఆసరా పింఛన్‌తో లబ్ధి పొందుతున్న వృద్ధులు, వికలాంగులు సీఎం కేసీఆర్ ని ఓ పెద్ద కొడుకులా, పెద్దన్నలా భావిస్తున్నారన్నారు. తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపిన నాయకుడు సీఎం కేసీఆర్‌ చెప్పారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్‌లు అవాక్కులు, చెవాక్కులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేస్తున్నాయా?అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ లా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబీమా, రైతుబంధు లాంటి పథకాలను బీజేపీ పాలితరాష్ట్రాల్లో అమలు చేసే దమ్ము బీజేపీకి ఉందా అని సవాల్‌ విసిరారు. ఆ పార్టీలతో ఓరిగేదేమి లేదన్నారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కళ్లబొల్లి మాటలు చెప్పే బీజేపీ, కాంగ్రెస్‌ల చేతిలో పెడితే ఆగం అవుతామని అన్నారు. తెలంగాణ రాకముందు పరిస్థితి ఏమిటి, కేసీఆర్‌ పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితులపై బేరీజు వేసుకోవాలన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, ఈ ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. కరోనా కష్టకాలంలో సైతం ఒక్క అభివృద్ధి, సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. బస్తీ దవాఖానలతో పేదలకు మెరుగైన వైద్యాన్ని చేరువ చేశామన్నారు. ఆసరా పెన్షన్ల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా పెన్షన్ డబ్బులు ఇస్తూ ఎక్కువ మందికి కూడా పెన్షన్లు అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించే బాధ్యత తమదన్నారు. ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో తిరిగి బలపర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కమిషనర్ వంశీ కృష్ణ మరియు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS