బంగారు భవిష్యత్తు కోసమే సీఎం జగన్ కృషి: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
మునగోడు హైస్కూల్ లో ట్యాబ్ ల పంపిణీ
బాలల బంగారు భవిష్యత్తు బాగుండాలనే సీఎం వైఎస్ జగన్ నాణ్యమైన విద్య అందిస్తున్నారని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. అమరావతి మండలం మునగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకే సీఎం జగన్ ఉచిత ట్యాబులు అందజేస్తున్నారన్నారు.
రూ.33,500 విలువైన ట్యాబులు సీఎం జగన్ విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారన్నారుప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రూ.17,500 కాగా… అందులో ఉపయోగించే బైజూస్ యాప్ విలువ రూ.15,500 అని చెప్పారు. ఒక్కొక్క ట్యాబ్ కోసం రూ.33 వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. దీన్ని ఉపయోగించుకొని ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. ఇవే కాకుండా నాడు నేడు ద్వారా స్కూళ్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన ఏర్పాటు చేశారన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారయ్యాయన్నారు. ప్రతి పేదవాడు చదువుకోవాలన్న సంకల్పంతో అమ్మఒడి, విదేశీ విద్యాదీవెన, విద్యాకానుక, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, ఫీజ్ రీయింబర్స్ మెంట్ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఉన్నత వర్గాలతో పాటు అణగారిన వర్గాలకు కూడా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు ఉపయోగించుకొని.. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరలని ఆకాంక్షించారు.