SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 02 at 4.50.54 PM

సాక్షిత : ఎన్నో సంవత్సరాల తమ కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని జీరా కాలనీలో లీజు ల్యాండ్ లో ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్న 134 ఇండ్ల స్థలాలను ఫ్రీ హోల్డ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన GO కాపీని కాలనీ వాసుల కరతాళధ్వనుల మద్య కాలనీ ప్రతినిధులకు మంత్రి అందజేశారు.

ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 1934 సంవత్సరంలో ఏర్పడిన జీరా కాలనీ వాసుల కలను మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెద్ద మనసుతో సాకారం చేశారని తెలిపారు. జీరా కాలనీ స్థలాలను ఫ్రీ హోల్డ్ చేయాలనే ఎన్నో సంవత్సరాల కోరిక కు ఆమోదం తెలిపారని వివరించారు. గత ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు తమ సమస్యను విన్నవించినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. కాలనీ ప్రజల సమస్యను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ల దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని వివరించారు. ఉదార స్వభావం కలిగిన ముఖ్యమంత్రి జీరా కాలనీ వాసుల సమస్యను అర్ధం చేసుకొని పెద్ద మనసుతో GO 816 ప్రకారం ఫ్రీ హోల్డ్ చేసేందుకు అంగీకరించారని తెలిపారు.

కాలనీ ప్రతినిధులు మాట్లాడుతూ సుమారు 38 సంవత్సరాల నుండి తమ స్థలాలను ఫ్రీ హోల్డ్ చేయాలని అనేక ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు విన్నవిస్తూ ఉన్నా ఎవరు కూడా పట్టించుకోలేదని అన్నారు. 1994 వ సంవత్సరంలో ప్రభుత్వం జారీ చేసిన GO 816 క్రింద ఫ్రీ హోల్డ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ, కోర్టు కేసు ల కారణంగా పెండింగ్ లో ఉంచారని వివరించారు. 2002 లో కోర్టు తీర్పు అనుకూలంగా ఉన్నప్పటికీ గడువు ముగిసిందనే కారణంతో GO 816 అమలుకు నోచుకోలేదని అన్నారు. తమ సొంత ఇంటి కల కల గానే మిగిలిపోనున్నదా అనే నైరాశ్యంతో ఉన్న తమకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారం, కృషితో కల నెరవేరిందని ప్రత్యేక అభినందనలను తెలిపారు.

తమ సమస్యను అనేక సార్లు ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి ల దృష్టికి తీసుకెళ్ళి GO 816 ప్రకారం ఫ్రీ హోల్డ్ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించి ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ చేయించారని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీరా కాలనీ అద్యక్షులు మాడపు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ యాదవ్, ఉపాధ్యక్షులు విజయ్ షా, కోశాధికారి రాజన్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS