మానవపాడు:-ఒక వైపు చదువుకోవాలనే పట్టుదల ఉద్యగం సాధించాలనే తపన, మరో వైపు ఆడపిల్లలకు చదువులు వద్దనే ఆరోపణలకు ఎక్కడా కూడా కుంగిపోలేదు. తల్లిదండ్రుల కలను సాకారం చేయాలనే సంకల్పం దాని కోసం మూడేళ్లు నిర్విరామంగా కష్టపడి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది.కృషి, పట్టుదల ఉంటే ఎదైనా సాధించవచ్చని నిరూపిస్తున్న దీపారెడ్డి స్టోరీ ఇది. ప్రభుత్వ కొలువు సాధించాలంటే కృషి పట్టుదల 24 గంటలు అదే ధ్యాసలో చదివితే గాని సాధించలేని పరిస్థితి మనకు నిరంతరం కనిపిస్తుంది.
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన బి.దీపారెడ్డి ఒకేసారి నాలుగు ఉద్యోగాలను సాధించింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ప్రభుత్వ ఉద్యోగం సాధించినట్లు ఆమె ‘దిశ’తో తెలిపింది. మా నమ్మకాన్ని నిజం చేస్తూ ఆమె సాధించిన ఈ విజయాలు మమ్మల్ని గర్వించేలా చేస్తున్నాయని తల్లిదండ్రులు దేవసేనారెడ్డి, హేమలత అన్నారు. ఉద్యోగం సాధించాలలని కష్టపడి చదువుతున్నప్పుడు తన కూతురుకు వివాహం చేశామని దీపారెడ్డి భర్త పవన్ కుమార్ రెడ్డి సహకరించడంతో చదువుకుని ఉద్యోగాలు సాధించినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఆడపిల్లలకు చదువులు వద్దనే చాలామంది విమర్శించారని, వారందరి ముందే శభాష్ అనే విధంగా బాగా చదువుకుని ఒకేసారి నాలుగు ఉద్యోగాల్లో అర్హత సాధించిందని వారి పెదనాన్న సుబ్బారెడ్డి తులసీ అన్నారు.
చిన్నప్పటి నుంచే చదువుకోలేని సంకల్పం ఉండడంతోనే దీప ప్రభుత్వ కొలువులను సాధించింది. విమర్శకులు చేసిన వారే ఇవాళ శభాష్ అంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం మూడేళ్లు కష్టపడినట్లు దీప తెలిపింది. మానోపాడు గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేసి దీపకు అభినందనలు తెలిపారు. గురుకుల జూనియర్ లెక్చరర్, గురుకుల పీజీటీ, ఏకలవ్య మోడల్ స్కూల్ టీచర్, గురుకుల డిగ్రీ లెక్చరర్‌గా కొలువులు సాధించింది. అందులో తనకు ఇష్టమైన గురుకుల డిగ్రీ లెక్చరర్‌గా జాయిన్ అయ్యేందుకు దీప సిద్ధమైంది. ఆడపిల్లలకు చదువులు వద్దంటున్న వారందరికీ చదివించాలనే సంకల్పం అందరిలో కల్పిస్తానని ధీమా వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జాయినింగ్ లెటర్ తీసుకుంటానని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.