SAKSHITHA NEWS

బాబు హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో నిధులు స్వాహా
– షెల్‌ కంపెనీలు సృష్టించి రూ.కోట్ల నిధులు మళ్లింపు
– అడ్డంగా దొరికిపోయినా బుకాయింపులా?
– చట్టానికి చంద్రబాబేమీ అతీతుడు కాదు
– అరెస్ట్‌ సంగతి తెలిసే కొన్ని రోజులుగా సింపతీ రాజకీయాలు
– జగన్‌ బటన్‌ నొక్కితే ప్రజల ఖాతాల్లోకి డబ్బులు
– చంద్రబాబు పాలనలో బటన్‌ నొక్కితే తిరిగి ఆయన ఖాతాలోకే నిధులు
– పూర్తి ఆధారాలు ఉండడం వల్లే చంద్రబాబును అరెస్టు చేశారు
– అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ

అనంతపురం, సెప్టెంబర్‌ 09 :

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం అనేది చంద్రబాబు చాలా స్కిల్డ్‌గా చేసిన స్కాం అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఆయనో స్కిల్డ్‌ క్రిమినల్‌ అని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగుల పేరుతో నిధులు దోపిడీ చేశారని చెప్పారు. శనివారం నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉండి చేసిన అతి పెద్ద స్కాం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం అని అన్నారు. షెల్‌ కంపెనీల ద్వారా రూ.371 కోట్లను మళ్లించారని, ఇందులో అంతిమ లబ్ధిదారుడు చంద్రబాబేనని అని తేలిందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక బటన్‌ నొక్కితే నిధులు ప్రజల ఖాతాల్లో జమ అవుతుంటే.. చంద్రబాబు పాలనలో ఆయన బటన్‌ నొక్కితే నిధులన్నీ మళ్లీ ఆయన ఖాతాలోకే వచ్చాయనడానికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం నిదర్శనమని అన్నారు. ఈ స్కాంలో తన రాజకీయ అనుభవాన్నంతా వాడుకున్నారని తెలిపారు. సీమెన్స్‌ కంపెనీ పేరుతో దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. రూ.3365 కోట్లతో ప్రాజెక్ట్‌ అని చెప్పి అందులో 10 శాతం వాటా ప్రభుత్వానిదని, 90 శాతం వాటా సీమెన్స్‌ కంపెనీ భరిస్తుందని మాయమాటలు చెప్పారన్నారు.

యువతకు నైపుణ్యం పేరుతో షెల్‌ కంపెనీలు సృష్టించి రూ.371 కోట్ల నిధులు మళ్లించి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో స్కిల్డ్‌ క్రిమినల్‌గా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో నోట్‌ఫైల్‌ పేరుతో కేబినెట్‌లోకి తెచ్చారని, ఆ తర్వాత డబ్బులు కాజేసే ప్లాన్‌ చేశారన్నారు. చంద్రబాబు సూచనతోనే నిధుల విడుదల జరిగిందని అన్నారు. 2017–2018లోనే జీఎస్టీ అధికారులు నిధుల మళ్లింపును బయటపెట్టాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంతో తమ కంపెనీ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని సాక్షాత్తూ సీమెన్స్‌ కంపెనీ చెప్పిందని గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా పక్కాగా నిధులను చంద్రబాబు దోపిడీ చేశారని తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మోసాలేనని అన్నారు. ఈ రోజు అడ్డంగా దొరికిపోయి బుకాయిస్తున్నారని మండిపడ్డారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో ‘లాస్ట్‌ రిసీవర్‌ ఆఫ్‌ ద మనీ’ చంద్రబాబేనని అధికారుల విచారణలో తేలిందని తెలిపారు. అన్ని ఆధారాలు ఉండబట్టే చంద్రబాబును అరెస్ట్‌ చేశారని అన్నారు. గతంలో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని స్టేలు తెచ్చుకున్న చరిత్ర చంద్రబాబుదని తెలిపారు. దేశంలో ఎవరూ తెచ్చుకోనన్ని స్టేలు తెచ్చుకున్న ఘనత చంద్రబాబుదన్నారు. అనేక కేసుల్లో ఈ రోజుకీ విచారణ జరగకుండా చేస్తున్నారన్నారు. తాను అరెస్ట్‌ అవుతానని తెలిసే పక్కాప్లాన్‌ ప్రకారం రాయలసీమలో పర్యటిస్తూ చంద్రబాబు సింపతీ రాజకీయాలు చేశారని అన్నారు.

ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నం చేశారని తెలిపారు. చంద్రబాబేమీ చట్టానికి అతీతుడు కాదని స్పష్టం చేశారు. చంద్రబాబును అరెస్ట్‌ చేస్తే ఎల్లో మీడియా కూడా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని, ఈ కేసులో తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన స్కాంలలో ఇది ఒకటి మాత్రమేనన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం జరిగిన గత ప్రభుత్వంలోని మంత్రివర్గంలో బీజేపీ ఉందని, ప్రభుత్వానికి జనసేన మద్దతుగా ఉందన్నారు. ఈ స్కాంలో అప్పటి మంత్రివర్గం బాధ్యత కూడా ఉందన్నారు. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం తమకు లేదని, చట్టం తన పని తాను చేసుకెళ్తోందని స్పష్టం చేశారు.


SAKSHITHA NEWS