వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని, ఆ ఆలోచనలను మానుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. తాము చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని మంత్రిని వారు కోరారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లాభాలలో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ లక్షలాది మంది బతుకలను రోడ్డున పడేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతోమంది పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించకుండా, రా మెటీరియల్ సరఫరా చేయకుండా పరిశ్రమను నష్టాలలోకి తీసుకెళ్ళి, ప్రైవేట్ పరం లేదా, తన కార్పోరేట్ అనుచరుల పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 780 రోజుల నుండి తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నా, ప్రజలు పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం అన్నారు. మంత్రిని కలిసిన వారిలో పరిరక్షణ కమిటీ సభ్యులు రాజ, శివ, శ్రీరామ్, సునీల్, మురళి, హరీష్ తదితరులు ఉన్నారు.