SAKSHITHA NEWS

అంతర్జాతీయ స్కేటర్‌ జెస్సీరాజ్‌ను వరించిన కేంద్ర ప్రభుత్వ పురస్కారం

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌–2025కు జెస్సీరాజ్‌ ఎంపిక

ప్రతిష్టాత్మకమైన అవార్డుకు జెస్సీనిఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ

దేశంలోని వివిధ అంశాల్లో అత్యంత ప్రతిభావంతులైన 25 మంది బాలలను ప్రతి ఏటా ఈ అవార్డుకు ఎంపిక

చిన్న వయసులోనే ప్రపంచ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న జెస్సీని క్రీడా విభాగానికి ఎంపిక చేసిన కేంద్రం

ఈ నెల 26న ఢిల్లీలోని రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకోనున్న జెస్సీ

ఇప్పటి వరకు 50 రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పతకాలను సాధించిన జెస్సీ

మంగళగిరి:

అంతర్జాతీయ స్కేటింగ్‌ వేధికపై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి ప్రపంచ క్రీడా ప్రముఖుల మన్ననలు పొందిన మంగళగిరికి చెందిన క్రీడాకారిణి జెస్సీరాజ్‌ను ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి రాష్ట్రీ బాల పురస్కార్‌–2025 వరించింది. 14 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ పతకం సాధించి ప్రపంచ క్రీడావనిపై మువ్వెన్నల జెండాను ఎగుర వేసిన జెస్సీని అత్యున్నత పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించనుంది. ఈ నెల 26వ తేదీన ఢిల్లీలోని రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనుంది.

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ను ప్రతి ఏటా దేశంలోని 25 మంది చిన్నారులకు కేంద్రం అందిస్తుంది. వివిధ అంశాల్లో విభిన్న ప్రతిభ చూపిన చిన్నారులను జ్యూరీ పారదర్శకంగా ఈ పురస్కారానికి ఎంపిక చేస్తుంది. 2025 పురస్కారానికి సంబందించిన జాబితాను ఈ నెల 17వ తేదీన కేంద్ర ప్రభుత్వ స్రీ, శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. క్రీడా విభాగంలో జెస్సీరాజ్‌ పేరును కేంద్ర ప్రస్తావించడం పట్ల సర్వత్రా హార్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ పటమటలోని ఎన్‌ఎస్‌ఎం స్కూల్‌లో జెస్సీరాజ్‌ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది.

చిన్న వయసులోనే..:
ప్రస్తుతం 14 ఏళ్ల వయసున్న జెస్సీ రాజ్‌ తన తొమ్మిదో ఏట నుంచే స్కేటింగ్‌ శిక్షణ ప్రారంభించింది. చిన్న వయసులోనే స్కేటింగ్‌పై ఇష్టాన్ని పెంచుకుంది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు మాత్రపు రాధ, సురేష్‌ గమనించి అటుగానే జెస్సీరాజ్‌ను నడిపించారు. కోచ్‌ సింహాద్రి వద్ద స్కేటింగ్‌లో శిక్షణ ఇప్పించారు. ఆదిలో ఇబ్బందులు పడినా శిక్షణను వదల్లేదు. పడి లేచిన కెరటంలా కేవలం ఐదేళ్లలోనే ప్రపంచ స్కేటర్ల చూపును తన వైపుకు తిప్పుకుంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి నుంచి ఆసియా కప్, ప్రపంచ కప్‌ పోటీల్లో రాణిస్తూ దేశ క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. ఇప్పటి వరకు 50 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ ఓషియానిక్‌ ఛాంపియన్‌షిప్‌లో తనకంటే పెద్ద వయసు వాళ్లతో తలపడింది. ఎట్టకేలకు ఇన్‌లైన్‌ ఫ్రీ స్కేటింగ్‌ విభాగంలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి.. ప్రపంచ దేశాల క్రీడాకారులను వెనక్కి నెట్టి భారత దేశానికి బంగారు పతకాన్ని అందించింది.

మంత్రి శ్రీ నారా లోకేష్‌ చొరవతో..:

ప్రపంచ పతకంతో రాష్ట్రానికి చేరుకున్న జెస్సీరాజ్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రత్యేకంగా అభినందించారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తుందని, క్రీడాకారులకు సముచిత స్థానం కల్పింస్తుందని మంత్రి పేర్కొంటూ.. జెస్సీరాజ్‌ను ప్రోత్సహించారు. ఈ ఏడాది కేంద్ర బాల పురస్కార్‌కు జెస్సీని ఎంపిక చేయాలని కోరుతూ మంత్రి లోకేష్‌ కేంద్రానికి లేఖ రాశారు. మంత్రి లోకేష్‌ సిఫార్సులతో కేంద్ర ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆమె తల్లిదండ్రులు రాధా, సురేష్‌ చెబుతున్నారు. తన కుమార్తెను కేంద్ర పురస్కారానికి సిఫార్సు చేసిన మంత్రి లోకేష్‌కు, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌కు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నారు.

అభినందనల వెల్లువ:

కేంద్ర పురస్కారానికి ఎంపికైన జెస్సీరాజ్‌ను గుంటూరు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీ, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, భారత రోలర్‌ స్కేటింగ్‌ సమాఖ్య కార్యదర్శి నరేష్‌శర్మ, ఆంధ్రప్రదేశ్‌ రోలర్‌ స్కేటింగ్‌ అసోసియేషన్‌ సీఈవో భగీరద్, అధ్యక్షలు సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి థామస్‌చౌదరి, కోచ్‌ సింహాద్రి, ఏపీ ఆర్టిస్టిక్‌ స్కేటింగ్‌ చైర్మన్‌ ఆకుల పవన్‌కుమార్, ఎన్‌ఎస్‌ఎం స్కూల్‌ ప్రిన్సిపాల్‌ బ్రదర్‌ రాయప్పరెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ బాలారెడ్డి అభినందనలు తెలిపారు.


SAKSHITHA NEWS