సీపీఐ 100 వసంతాల ఉత్సవాలు జయప్రదం చేయండి
జిల్లా కార్యదర్శి మారుతీవరప్రసాద్
చిలకలూరిపేట:
ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసి, పేదల పక్షాన నిలబడే పార్టీ సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ మారుతీవరప్రసాద్ చెప్పారు. ఆయన ఈ నెల 26వ తేదీ 100 వసంతాల ఉత్సవాలను జయప్రదం చేయాలని పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26 న ఆవిర్భవించి 2025 డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నదని తెలిపారు. దేశంలో 100 సంవత్సరాల ఉద్యమ పార్టీగా సీపీఐ ఖ్యాతి పొందిందని ,స్వాతంత్ర్యం కొరకు జరిగిన పోరాటంలో ఆనాడే అనేకమందిప్రాణ త్యాగాలు చేసిన వీర చరిత్ర గలది భారత కమ్యూనిస్టు పార్టీ అని తెలియజేశారు.
దేశ స్వాతంత్ర్యం కోసం, ఫ్యూడల్ సంస్థానాల విముక్తి కొరకు, తాడిత పీడత జనావళి కొరకు వేలాది మంది ప్రాణాలను కోల్పోయిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పారు. మహోజ్వల చరిత్ర కలిగిన భారత్ ను కాపాడుకోవడంలో అహర్నిశలు కృషి చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపాలని పిలుపు నిచ్చారు. ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు, పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, ఏఐవైఎఫ్ జిల్లా ఇన్చార్జి షేక్ సుభాని, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, చౌటుపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.