SAKSHITHA NEWS

పార్లమెంట్ లో బీఆర్ఎస్ ప్రకంపనలు

వాయిదాల పర్వంపై బీఆర్ఎస్ మండిపాటు

విజయ్ చౌక్ లో నినాదాలు చేస్తూ ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎంపీల ధర్నా

జేపీసీకి నామ నాగేశ్వరరావు డిమాండ్

ప్రతిపక్ష పాత్రనూ పోషిస్తున్న కేంద్రం

ప్రజలంతా కేంద్రం దుర్నీతిని గమనిస్తున్నారు

కేంద్రానికి తగిన గుణపాఠం ఖాయం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

అదానీ – హిడెన్ బర్గ్ అంశంపై బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. బీఆర్ఎస్, విపక్ష పార్టీల ఆందోళనతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఇస్తున్న వాయిదా తీర్మాణాలను తిరస్కరిస్తూ ఉభయ సభలను వాయిదా వేసుకుంటూ పోతుండడం పట్ల సర్వత్రా నిరసన వెల్లువ కొనసాగుతోంది. కేంద్రం తీరుపై బీఆర్ఎస్ మండిపడుతోంది.అదానీ అంశంపై సత్వరమే సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులతో దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ పార్లమెంట్ నుంచి నడుచుకుంటూ వెళ్లి విజయ్ చౌక్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మోదీ డౌన్ డౌన్… కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వం నశించాలి… అదానీ అంశంపై జేపీసీ వేయాలి.. ప్రజాస్వామ్య విలువలు కాపాడలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లోక్ సభలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కావాలనే అదానీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు పార్లమెంట్ ను తనంతట తానే వాయిదా వేసుకుంటూపోతూ మాట్లాడకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని ధ్వజమెత్తారు .

స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఇటువంటి పర్ణిస్థితిని ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులమంతా నిత్యం పార్లమెంట్ లోపల, బయట ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు శాంతియుతంగా ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశంపై ఆందోళన చేస్తున్నా కేంద్రం నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ప్రజలకు జవాబు చెప్పకుండా మోహం చాటేస్తుండడం దారుణమన్నారు. పార్లమెంట్ లో అధికార పక్ష ఎంపీలే పార్లమెంట్ ను వాయిదా వేయాలని కోరుతున్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల ఆందోళనలను పట్టించుకోకుండా సభను వాయిదా వేస్తూ తానే ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తున్న వింత పరిస్థితి పార్లమెంట్ లో ఉందని నామ పేర్కొన్నారు. ఒక వైపు దర్యాప్తు సంస్థలను ప్రతి పక్ష పార్టీల నాయకులపై ఉసి కొల్పుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని దుయ్యబటారు. కేంద్రం దుర్నీతిని దేశ ప్రజలంతా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వారికి ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని స్పష్టం చేశారు.

అదానీ అంశంపై జేపీసీ వేయాలని పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రతిపక్షాలను సభల్లో నోరు తెరవనీయకుండా సభలను వాయిదా వేస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందన్నారు. కోట్లాది మంది ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎల్ఐసి , ఎస్బీఐ , తదితర బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో దాచుకున్నారని, ఇప్పుడు ప్రజల డబ్బుకు భద్రత కరువైందని, ఈ అంశంపై చర్చించాలని కోరుతూ నిత్యం వాయిదా తీర్మానాలు ఇస్తున్నా ప్రతి సారి తిరస్కరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా అదానీ -హిడెన్ బర్గ్ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీనీ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి, వాస్తవాలు ప్రజల ముందుంచాలని నామ డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన శాస్తి చేయడం తధ్యమని నామ పేర్కొన్నారు. ఈ ధర్నాలో పార్టీ పార్లమెంటరీ నాయకులు కే.కేశవరావు, పార్టీ ఎంపీలంతా పాల్గొన్నారు. కాగా అదానీ అంశంపై సోమవారం కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ప్రతిపక్ష విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జేపీసీకి డిమాండ్ చేయడంతో తొలుత సభలను మధ్యాహ్నాం 2 గంటలకు వాయిదా వేశారు. మళ్ళీ 2 గంటలకు సభ సమావేశం కాగానే అదే పరిస్థితి తలెత్తడంతో ఉభయ సభలను మంగళవారానికి వాయిదా వేశారు.


SAKSHITHA NEWS