Bhatti’s Tribute to Former Chief Minister Roshaiah
మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు భట్టి నివాళులు
రోశయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అజాత శత్రువు కొణిజేటి రోశయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
హైదరాబాదులో జరిగిన రోశయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రోశయ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మంత్రివర్యులుగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన క్రమంలో తాను ప్రభుత్వ చీఫ్ విప్ గా పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా, చీఫ్ spoke person గా రోశయ్య అధిష్టానం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా రాజకీయ విలువలతో పార్టీని నడిపించిన మహా నాయకుడు అని కొనియాడారు. ఈ సమయంలో తాను ప్రదేశ్ కాంగ్రెస్ సెక్రెటరీగా రోశయ్య తో దగ్గరగా కలిసి పని చేశానని గుర్తు చేసుకున్నారు.
స్వాతంత్ర సమరయోధుల తొలితరం కాంగ్రెస్ నేతగా విలువలతో కూడిన రాజకీయం చేసిన గొప్ప రాజకీయవేత్త రోశయ్య అని అభివర్ణించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు లేకుండా కేవలం సైద్ధాంతికంగా మాత్రమే మాట్లాడి రోశయ్య గారు రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించారని అన్నారు.
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య రాష్ట్ర శాసనసభలో 18 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన అపర చాణక్యుడన్నారు. మంత్రిగా అనేక శాఖలను నిర్వహించి ఆ పదవులకే వన్నె తెచ్చిన కృషివలుడన్నారు. రాజకీయాలలో మచ్చలేని మహనాయకుడన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే వారికి ఆయన లేని లోటు తీర్చలేమని పేర్కొన్నారు.
విద్యార్థి దశ నుండే ఆచార్య ఎన్.జి. రంగా శిష్యుడిగా రాజకీయాలలో ప్రవేశించి విలువలు పాటిస్తూ వివాద రహితుడుగా, అజాత శత్రువుగా, సౌమ్యుడిగా, సహన శీలిగా కీర్తిని గడించారని వివరించారు.
నేటి రాజకీయ నాయకులకు రోశయ్య జీవితం ఆదర్శప్రాయం అని అన్నారు. భౌతికంగా ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అని పేర్కొన్నారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడుని ప్రార్థించినట్లు చెప్పారు.