Bharat Rashtra Samithi formation public meeting in Telangana
హైదరాబాద్: తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభను ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీనికి దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయి విజయన్, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లను ఆహ్వానించారు. కేజ్రీవాల్, భగవంత్‌మాన్, అఖిలేష్‌లు అంగీకారం తెలపగా… కేరళ సీఎం తమ నిర్ణయాన్ని సోమవారం వెల్లడించనున్నారు.
18న ఖమ్మం కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని 100 ఎకరాల మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. లక్ష మందికి పైగా జనసమీకరణ చేయనున్నారు. ఈ నెల 12న మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలలో కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలున్నా అక్కడ సమావేశాలు మాత్రమే జరపనున్నారు.
18న జరిగే సభకు ఖమ్మంతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల నుంచి జనసమీకరణ జరపనున్నట్లు తెలుస్తోంది.
ఖమ్మంలోనే ఎందుకు?
ఖమ్మం జిల్లాను కీలకంగా సీఎం భావిస్తున్నారు. జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉంది. ఏపీలో ఇటీవలే భారాస అధ్యక్షుడిని ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ పార్టీ శాఖను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. పైగా ఖమ్మం జిల్లాలో వామపక్షాలకు బలం ఉంది.
ఇటీవలి మునుగోడు ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టులతో పొత్తు కుదిరింది. దీనికి తోడు అక్కడ పార్టీలో వర్గ విభేదాలున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని భారాస బలాన్ని చాటేందుకు ఖమ్మంలో ఆవిర్భావ సభను నిర్వహించాలని సీఎం నిర్ణయించుకొన్నట్లు తెలిసింది.
సచివాలయం ప్రారంభోత్సవం 18న లేనట్లే
18న రాష్ట్ర సచివాలయాన్ని ప్రారంభించాలని గతంలో ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ఖరారైన నేపథ్యంలో సచివాలయ ప్రారంభోత్సవం ఆ రోజు లేనట్లేనని తేలింది. పనులు పూర్తిగా అయిన తర్వాతే ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.