రాజేంద్రనగర్, ఏప్రిల్ 23: బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్ (Chevella BRS candidate Kasani Gnaneshwar) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు.
చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్ర నగర్లో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ సందర్భంగా బద్వేల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బలహీనవర్గాలకు సీట్లు ఇస్తే గెలవరన్న అపవాదు ఉందన్నారు. కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి అది తప్పని నిరూపించాలన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటి సారిగా బీసీ అభ్యర్థి బరిలో ఉన్నారని తెలిపారు. కాసానిని గెలిపించుకోవాల్సిన భాధ్యత అందరిపై ఉందన్నారు.
ఆ పిరికిపందెలకు బుద్ది చెప్పాలి…
మోదీకి, ఎన్డీఏ కూటమికి 400 కాదు..200ల సీట్లు కూడా వచ్చేలా లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేదెవరైనా మన వద్దకు రావాలంటే బీఆర్ఎస్కు మంచి సీట్లు రావాలన్నారు. బీఆర్ఎస్కు 8 నుంచి 10 సీట్లు ఇస్తే మనం చెప్పినట్లే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వింటదని చెప్పుకొచ్చారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు తప్పకుండా బుద్ధి చెప్పాలని కేటీఆర్ పేర్కొన్నారు.