SAKSHITHA NEWS

విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు

డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గౌట్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీ లలో ఆర్థిక అక్షరాస్యత క్యాంప్స్ జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అశ్వరావుపేట మండలం, బచ్చువారిగూడెం గ్రామపంచాయతీలో ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్స్ ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా భద్రాద్రి జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు చిన్న వయసు నుండే పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. అలా చేసిన పొదుపును సురక్షితంగా ఉండే పథకాలలో ఎలా భద్రపరచుకోవాలో వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నియంత్రిత సంస్థలలో మాత్రమే డిపాజిట్ చేయడం లేదా అప్పు తీసుకోవడం చేయాలన్నారు. ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంక్ కస్టమర్స్ ఎవరూ తమ ఓటీపీ ఎటిఎం పిన్, పాస్వర్డ్ ఎవరికీ చెప్పకూడదని పిలుపునిచ్చారు. ఆన్లైన్ లో తెలియని లింక్స్ క్లిక్ చేసి మీ కష్టార్జితాన్ని సైబర్ మోసగాళ్ళ కు అర్పించవద్దని సూచించారు.

ఏ బ్యాంక్ అధికారి కూడా తమ కస్టమర్స్ కి ఫోన్ చేసి ఓటీపీ ఎటిఎం పిన్, పాస్వర్డ్ చెప్పమని అడగరనీ, అలాంటి ఫోన్ కాల్స్ వస్తే స్పందించవద్దని వివరించారు. ఒక వేళ పొరపాటున ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే, వెంటనే 1930 నంబర్ కు కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చని వివరించారు. కేంద్ర ప్రభుత్వం కల్పస్తున్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష యోజన స్కీమ్స్ ద్వారా అతి తక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం తో Rs.2 లక్షల రూపాయల వరకు జీవిత భీమా, ప్రమాద బీమా పొందవచ్చనీ, సుకన్య సమృద్ధి స్కీమ్ ద్వారా ఆడపిల్లలకు ఆర్థిక భరోసా కలుగుతుందని వివరించారు. విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ కి సంబంధించిన వివరాలు చెప్తూ, వారి సందేహాలు నివృత్తి చేశారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జి జయ, లెక్చరర్స్, కళాశాల సిబ్బంది సిఎఫ్ఎల్ దమ్మపేట కౌన్సిలర్స్ వి అంజిబాబు, డి చంటి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ రావుల ముత్తు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS