ఆశావహుల్లో అలజడి.. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు..!!
వచ్చే నెలలో ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు జరిపిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడంతో ఆశావహుల్లో అలజడి మొదలైంది.
ఎప్పటి నుంచో ప్రజల్లో ఉంటూ వారికి అవసరమైన సేవలు చేస్తున్న నాయకులు టికెట్ ను ఆశిస్తున్నారు. వారితో పాటు నిత్యం నీడలా నాయకుల వెన్నంటి ఉంటూ నియోజక వర్గాల ఇంచార్జిలు, డీసీసీ ప్రెసిడెంట్లకు సలాం చేసేవారు సైతం పోటీకి సై అంటున్నారు. ఒకరు ప్రజల్లో ఉంటూ ప్రజాసేవచేస్తున్న బ్యాచ్ అయితే, మరో బ్యాచ్ నియోజకవర్గాల ఇంచార్జిలను, ఆ పై స్థాయి వారిని నమ్ముకునే పోటీల్లో దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, రేవంత్ రెడ్డి లాంటి పక్కా మాస్ లీడర్ ఈ సారి సీఎంగా పదవిలో ఉండటంతో సర్పంచ్ ఎన్నికలలో పోటీకి మునుపెన్నడూ లేనంత ఆసక్తిని కలిగించే అవకాశాలున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 1080 గ్రామ పంచాయతీలు..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1080 గ్రామపంచాయతీలున్నాయి. వీటిలో నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో పాతవి 530 కాగా, 15 కొత్త పంచాయతీలున్నాయి. అలాగే కామారెడ్డి జిల్లాలో 535 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 526 గ్రామపంచాయతీలు పాతవి కాగా, 9 కొత్త గ్రామపంచాయతీలున్నాయి. ఆయా గ్రామ పంచాయతీలకు గతంలో ఉన్న రిజర్వేషన్లలో ఈసారి భారీగా మార్పులు జరుగనున్నాయి. త్వరలో జరిగే ఎలక్షన్లకు పాత రిజర్వేషన్లు వర్తించవని అధికారులు చెపుతున్న మాట. రాష్ట్రంలో జరుగుతున్న బీసీ గణన తర్వాత రిజర్వేషన్లలో భారీ మార్పులు జరుగనున్నాయి. రిజర్వేషన్లలో బీసీలకు గతం కన్నా మెరుగైన రిజర్వేషన్లు దక్కే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. పురుషుల కన్నా అధిక సంఖ్యలో ఉన్న మహిళలకు ఈసారి అత్యధిక ప్రాధాన్యం దక్కనుంది.
బీసీలకు సరైన న్యాయం ఈసారైనా దక్కేనా?
స్థానిక సంస్థల రాజకీయాల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు బీసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందనే ఆవేదన బీసీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. బీసీల పై ప్రభుత్వాల వివక్ష వారి రాజకీయ అవకాశాలపై దెబ్బ కొడుతోందనే ఆక్రోషం ఎప్పటి నుంచో ఉంది. గ్రామీణ రాజకీయాల్లో సైతం బీసీ వర్గాలు అన్యాయానికి గురువుతున్నారనే అభిప్రాయాలకు బీసీ గణన తర్వాత ఓ పరిష్కారం దొరుకుతుందనే ఆశతో బీసీ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా సైరన్ మోగకపోయినా పంచాయతీ రాజ్ శాఖలో ఎన్నికలకు ముందు జరగాల్సిన ముందస్తు ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర నేతలతో టచ్ లో ఉంటున్న ఆశావహులు..
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే టికెట్ కోసం తంటాలు పడే బదులు ఇప్పటి నుంచే ఫైరవీలు చేసుకోవాలనే ఆరాటం ఆశావహుల్లో ఎక్కువైంది. టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ను కలుస్తూ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే తమ ఆశను ఆయన చెవిన వేస్తున్నారని తెలిసింది. ఆయనెవరికీ మాటివ్వకపోయినా, ఎన్నికల షెడ్యూలైతే రిలీజ్ కానివ్వండని, రిజర్వేషన్ల ఖరారు జరిగాక అప్పుడు చూద్దామని దాటవేస్తున్నారే తప్ప ఇప్పటి వరకు ఎవరికీ పక్కాగా హామీ ఇవ్వడం లేదని సమాచారం. కామారెడ్డి జిల్లాకు చెందిన ఆశావహులు మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ తో టచ్ లో ఉంటున్నారు. ఆయన కూడా ఎవరికీ హామీ ఇవ్వకుండా రిజర్వేషన్ల ఖరారు తర్వాత చూద్దామని టీపీసీసీ ప్రెసిడెంట్ చెప్పినట్లే చెపుతూ గ్రౌండ్ వర్క్ చేసుకోండని సూచిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి అభ్యర్థుల మధ్య పోటీ ఎలా ఉంటుందన్న విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ లో టిక్కెట్ కోసం పోటీ మాత్రం భయంకరంగా ఉండే అవకాశాలున్నాయని, అందరినీ ఎలా సర్దుబాటు చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడటం ఖాయంగా భావిస్తున్నట్లు కాంగ్రెస్ పెద్దలు చెపుతున్నారు.