SAKSHITHA NEWS

As part of the second phase of the Kanti Velam program, the District Collector conducted a surprise inspection

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వివి. పాలెం ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రిస్కిప్షన్ కళ్ళద్దాలు ఎన్ని వచ్చాయి, ఎన్ని పంపిణీ చేశారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ స్వయంగా వివి. పాలెం లోని గుగులోతు కృష్ణ ఇంటికి వెళ్లి, వారి ఇంట్లో కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు చేసుకొని ప్రిస్కిప్షన్ కళ్ళద్దాలు పొందిన వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుగులోతు కృష్ణ కు, గుగులోతు కావేరి కి ప్రిస్కిప్షన్ కళ్ళద్దాలు అందినట్లు, వీటితో కంటి చూపు చాలా మెరుగైనట్లు, ఇప్పుడు చక్కగా కనిపిస్తున్నట్లు ఆనందం వెలిబుచ్చారు.

పరీక్షలు ఉచితంగా నిర్వహించి, ఉచితంగా మందులు, కళ్ళద్దాలు అందించడం చాలా గొప్ప విషయమని వారు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లాలో మంచి స్పందన వస్తున్నట్లు తెలిపారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి రీడింగ్ కళ్ళద్దాలు వెంటనే ఇవ్వడం జరుగుతున్నట్లు, ప్రిస్కిప్షన్ కళ్ళద్దాలు అవసరమైనవారికి సరఫరా కోసం ఇండెంట్ చేసి, వారి వారి ఇండ్ల వద్దకే అందించే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాకు 1888 ప్రిస్కిప్షన్ కళ్ళద్దాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరగా, ఇప్పటికే 1305 కళ్ళద్దాలు లబ్ధిదారులకు ఆందజేసినట్లు ఆయన అన్నారు.

జనవరి 18 న ప్రారంభమయిన కంటి వెలుగు కార్యక్రమం 100 పనిదినాల పాటు కొనసాగుతుందని, 55 బృందాల ద్వారా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకొని, కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, వైద్యాధికారిని డా. సంధ్యారాణి, సిబ్బంది తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS