డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు…..
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
-కలెక్టరేట్ బస్ స్టాప్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, ఫీడింగ్ రూమ్, ఎస్.బి.ఐ. బ్యాంకు, భోజనశాలను ఆదివారం ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం
-డిప్యూటీ సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కు ఆదివారం ఉదయం పలు ప్రారభోత్సవాలకు డిప్యూటీ సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా జరగాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, కలెక్టరేట్ లో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న బస్ స్టాప్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, ఫీడింగ్ రూమ్, ఎస్.బి.ఐ. బ్యాంకు, భోజనశాలలను పరిశీలించారు. బస్ స్టాప్ పరిశీలన అనంతరం అక్కడ ఉన్న ప్రజలతో కలెక్టర్ ముచ్చటించారు. జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన పని వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ కు వచ్చే వారి సౌకర్యార్థం కలక్టరేట్ వద్ద బస్ స్టాప్ ఏర్పాటు చేయడం వలన నీడతో పాటు, ఆర్టీసి సేవలు సద్వినియోగం చేసుకొని ప్రశాంతంగా ప్రయాణం చేసి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు.
వైరా మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన నాగేశ్వర్ రావు అనే రైతుతో ఏ పంట సాగు చేస్తున్నారు, దిగుబడి ఎంత వస్తుంది, మొదలగు వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఆయిల్ పామ్ సాగు వల్ల లాభం చేకూరుతుందని, మొదటి 3 సంవత్సరాలు అంతర్ పంటల వల్ల ఆదాయం వస్తుందని, ఆయిల్ పామ్ సాగు వైపు దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. వరదల వల్ల దెబ్బతిన్న పంట పొలాలకు పరిహారం అందిస్తామని అన్నారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసామని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని, తమతో పాటు తమ చుట్టూ వున్న ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చదివించేలా ప్రోత్సహించాలని తెలిపారు. బీ ఫార్మసీ విద్యార్థి ధీరజ్ తో మాట్లాడి చదువు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సుబ్లేడు గ్రామానికి చెందిన దివ్యాంగురాలు సైదమ్మ దరఖాస్తును కలెక్టర్ పరిశీలించారు. డీఎస్సీ పరీక్షలో ఎంపిక కాలేదని తనకు ఏదైనా పాఠశాలలో టీచర్ ఉద్యోగం ఇప్పించాలని కోరగా, జిల్లా కలెక్టర్ పరిశీలించి అందుబాటులో ఉన్న పాఠశాలలో వాలంటీర్ క్రింద ఎంపిక చేస్తామని, రాబోయే రోజులలో ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకు సైతం సిద్ధం కావాలని సూచించారు.
వైరా మండలం పాలడుగు గ్రామానికి చెందిన వృద్ధుడు రాజయ్య ఇంటి కొనుగోలు చేసి డబ్బులు చెల్లించలేదని, బెదిరిస్తున్నారని తెలుపగా, వైరా మండల తహసిల్దార్ తో చరవాణిలో కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటి విలువ ఇవ్వలేని పక్షంలో ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకొని ఇప్పించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఆదివారం నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నందు పర్యటిస్తారని, కలెక్టరేట్ బస్ స్టాప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భోజనశాల, ఫీడింగ్ రూమ్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ప్రారంభిస్తారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ సంఘాల సభ్యులు అందుబాటులో ఉండాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, డిఆర్డీవో సన్యాసయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.