తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో మరో సంచలనం
ఎమ్మార్వో సోదరుడిగా చెప్పుకొనే రాజేంద్ర అనుమానాస్పద మృతి..!
విశాఖపట్నం:
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో మరో సంచలనం వెలుగుచూసింది. బొండపల్లి తహసీల్దార్ సనపల రమణయ్య హత్య కేసులో వాస్తవాలను వెలికి తీసేందుకు ఇప్పటికీ పోలీసుల దర్యాప్తు జరుపుతూనే ఉన్న సమయంలో అతని సోదరుడిగా చెప్పుకొంటున్న ప్రధాన రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజేంద్ర(40) అనుమానాస్పద మృతి చెందిన విషయం శనివారం బయట పడింది.
ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది . ఎమ్మార్వో రమణయ్య హత్య జరిగిన తర్వాత రోజు ఘటనా స్థలి వద్ద రాజేంద్ర హడావుడి చేసిన సంగతి తెలిసిందే.
తనతో పాటు రమణయ్య కుటుంబ సభ్యుల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్ ప్రసాద్ అనే వ్యక్తి హత్య చేస్తానని బెదిరించినట్టు అప్పట్లో రాజేంద్ర మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు .
తనను కూడా హత్య చేస్తామని బెదిరించడం వల్ల తాను ఇంట్లోనే దాక్కున్నట్టు మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర శ్రీకాకుళంలో బలవన్మరణం చెందినట్టు తెలియడంతో ఈ కేసులో మరిన్ని అనుమానాలు పెరిగిపోతున్నాయి
నిందితుడు మురారి పోలీసుల కస్టడీలో చెప్పిన నిజాలేంటి..?కన్వేయన్స్ డీడ్ వ్యవహారం కాకుండా ఇంకేదైనా ఉందా ..? మురారి కాల్ రికార్డులో దొరికిన ఆధారాలేంటి ? ఈ కేసులో అసలు నిజాలు బయటపెట్టడానికి పోలీసులు జాప్యం ఎందుకు చేస్తున్నారు..? తెర వెనుక దాగిఉన్న పెద్దలెవరు..? అనే అనుమానాలు ఉండనే ఉన్నాయి.
అంతలోనే తహసీల్దార్ రమణయ్య సోదరుడిగా చెప్పుకొనే రాజేంద్ర ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలియయడంతో ప్రజల్లో మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి ..