SAKSHITHA NEWS

హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం !

హైదరాబాద్‌లో స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ ధరలే ప్లాట్లు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ఈ కంపెనీ వంద కోట్లలకుపైగా వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నెలలు గడిచిపోతున్నా ప్లాట్లు ఇవ్వకపోవడం తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులంతా ఆ కంపెనీ కార్యాలయం ఉన్న ఎల్బీనగర్ లో ఆందోళనకు దిగారు.

స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ సంస్థ ఫామ్ ల్యాండ్స్, హెచ్‌ఎండీఏ ప్లాట్లు అమ్ముతామని ఏజెంట్లను పెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేసుకుంది. మొదట్లో పెద్ద ఎత్తున లగ్జరీ కార్యక్రమాలు నిర్వహించింది. ఏజెంట్లకు ఆడికార్లు వంటివి బహుకరించింది. ఈ బిల్డప్ చూసి భారీగా భూములున్నాయని చాలా మంది అనుకున్నారు. పద్ద ఎత్తున రిటర్న్స్ వస్తాయని చెప్పి ప్లాట్ల కోసం డబ్బులు కట్టించుకున్నారు. ఏవో ఒప్పంద పత్రాలు ఇచ్చారు కానీ అందులో భూమి, ప్లాట్ల వివరాలు లేవు.

మూడేళ్ల నుంచి వారి కార్యకలాపాలు తగ్గిపోయాయి. డబ్బులు కట్టిన వారు తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని అడుగుతున్నా స్పందించడం లేదు. చివరికి వారు స్పెక్ట్రా కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్కువ ధరకు ప్లాట్లు అని చెబితే… సర్వం పోగొట్టుకున్న కుటుంబాలు లబోదిబోమంటున్నాయి.


SAKSHITHA NEWS