Annam Foundation should stop irregularities
అన్నం ఫౌండేషన్ అక్రమాలను అరికట్టాలి
— అక్రమాలు బయటకు రాకుండా కిడ్నాప్, దాడి
–అన్నం శ్రీనివాస్ తో నాకు ప్రాణహాని ఉంది.
విలేకరుల సమావేశంలో బాధితుడు మాడిశెట్టి ఓం ప్రకాష్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
అన్నం ఫౌండేషన్ లో సేవా ముసుగులో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని బయట పెడతాననే ఉద్దేశ్యంతో నన్ను కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి చంపేందుకు ప్రయత్నించారని ఖమ్మం రోటరీనగర్‌లో నివాస ముంటున్న మాడిశెట్టి ఓంప్రకాష్ ఆరోపించాడు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అన్నం పౌండేషన్ అభివృద్ధి కోసం,
జనాభా సేకరణ కోసం బస్టాండ్, రైల్వే స్టేషన్లలో అనాధలుగా, వికలాంగులుగా, ఒంటరి మహిళలను, భిక్షాటన చేసేవారిని రాత్రివేళ బలవంతంగా అన్నం పౌండేషన్ కి తీసుకొని వచ్చి వారిని కొట్టి, చిత్ర హింసలకు గురిచేసి మతిస్థిమితం లేనివారిగా చిత్రీకరించి అన్నం ఫౌండేషన్ పేరుతో వారికి సేవ సేస్తున్నట్టు అధికారులు, మీడియా, బయటవారికి తెలియజేస్తున్న అన్నం శ్రీనివాస్ పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
అన్నం శ్రీనివాస్ చాలా కాలం నుండి తెలుసని అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలకు వాలంటేరుగా వెళ్లే వాడినని, అనాదలుగా తీసుకొచ్చిన వారిని కాళ్ళు, చేతులు కట్టి తీవ్రంగా కొడుతుంటే ఆ వీడియోలు తీయడం జరిగిందని, వాళ్ళు కూడా వీడియోలు తీసేవారని ఆరోపించాడు. ఎదురు తిరిగిన అనాదలను కొట్టి హింసించే క్రమంలో చనిపోతే అనాధ శవాలుగా దహన సంస్కారాలు చేసి మంచివాడిగా పేరు తెచ్చుకుంటున్నాడని ఆరోపించాడు.
గతంలో ఓ ఇద్దరు వ్యక్తులు అన్నం శ్రీనివాస్ తో గొడవపడి వారిపై కేసుపెట్టి జైలుకు పంపించడం జరిగింది. వారు బయటకు వచ్చిన తర్వాత నాతో మాట్లాడింది అన్నం శ్రీనివాస్ చూసి నా దగ్గర ఉన్న వీడియోలు వారికిచ్చి బయట పెడతాననే అనుమానంతో డిసెంబర్ 29 గొల్లగూడెంలో రూములో ఉన్న నన్ను శ్రీనివాస్ తో పాటు ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి వారి కారులో తీసుకెళ్లి రూములు మారుస్తూ చిత్రహింసలకు గురిచేసి చంపాలని చూడగా మా బంధువులు రావడంతో బతికి బయట పడ్డానని, నాకు ప్రాణహాని ఉందని కాపాడాలని అధికారులను వేడుకున్నాడు.
మేరు కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్దినేని బోస్ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు అన్నం శ్రీనివాస్ పై కేసు నమోదుచేసి అరెస్ట్ చేయకుండా తాత్సారం చేయడం పలు అనుమానాలకు దారితీస్తుందని, వెంటనే అరెస్ట్ చేసి, అన్నం పౌండేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి అన్నం ఫౌండేషన్ లో ఉన్న అనాధలను వికలాంగులను కాపాడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జానకిరామయ్య, కుమార్, హరిగోపాల్, వెంకటేశ్వర్లు, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.