SAKSHITHA NEWS


Amidst the chanting of Vedic scholars, Anga Ranga is a glorious mountain

వేద పండితుల మంత్రోచ్చారణ ల మధ్య అంగ రంగ వైభవంగా పర్వత గిరిలో పూర్తయిన లింగ పున: ప్రతిష్ఠాపన

*సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పాల్గొన్న ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఎర్రబెల్లి రామ్మోహన్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు


సాక్షిత పర్వత గిరి, : ఎత్తైన కొండలు, కనువిందు చేసే రిజర్వాయర్, కనుచూపు మేర పచ్చదనం మధ్య కాకతీయుల చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన పర్వతగిరి పర్వతాల శివాలయంలో లింగ పున: ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగ రంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణ ల మధ్య శివలింగ ప్రతిష్ఠను అత్యంత భక్తి ప్రపత్తులు, శ్రద్ధాసక్తులతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు – ఉషా దయాకర్ రావు దంపతులు సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొన్నారు.

ఉదయం 6 గంటలకు యంత్రాభిషేకం జరిగింది. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, కల్లెడ రామ్మోహన్ రావు, గ్రామ సర్పంచ్ సోమేశ్వర రావు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇతర ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, పెద్దలు, అశేషంగా తరలి వచ్చిన భక్తుల సమక్షంలో లింగ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ప్రారంభించారు. లింగానికి పూజాదికాలు నిర్వహించారు. లింగ ప్రతిష్ఠాపన చేశారు. ఆ తర్వాత లింగాభిషేకాలు నిర్వహించారు. అనంతరం అతిథులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.

పర్వతగిరిలో కాకతీయులు ఆరాధించి, ప్రతిష్టించిన శివలింగ పున: ప్రతిష్ఠాపన తో ప్రకృతి రమణీయ పర్వతాల గుట్ట పై పవిత్ర హృదయాలతో కొలిచే తన భక్తులకు దర్శనమిస్తున్నారు. లింగ పున: ప్రతిష్ట పూర్తి కావడంతో వేలాది గా భక్తులు శివలింగ దర్శనం చేసుకుంటూ, అభిషేకాలు కావిస్తున్నారు. పర్వతాల గుట్టలు శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు భక్తి పారవశ్యం తో ఊగిపోతున్నారు. పర్వతగిరి ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.

కాగా, నేటితో ప్రారంభమైన పర్వతాల శివాలయం జాతరకు ప్రతి ఒక్కరూ వచ్చి, శివున్ని అభిషేకించి పరమేశ్వరుని కరుణకు పాత్రులు కావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భక్తులను కోరారు.

ఇదిలా ఉండగా, శివ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామి చే కళ్యాణం, పూర్ణాహుతి, పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి రెండు గంటలకు ఒకసారి వందలాది మంది పాఠశాల విద్యార్థులతో వందేమాతరం, శివ నామ స్మరణం జరుగుతున్నది. సాయంత్రం సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ నేపథ్య గాయని సునీత పాటల కార్యక్రమం జరుగుతుంది


SAKSHITHA NEWS