శరవేగంగా అమరావతి – బెల్లంకొండ డబుల్ రోడ్డు పనులు
ఊటుకూరులో సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
2024 జనవరి నాటికి పనులు పూర్తి చేస్తామని భరోసా
పెదకూరపాడు నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల తీరుతోంది. అమరావతి – బెల్లంకొండ డబుల్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా అమరావతి – బెల్లంకొండ డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి రోడ్డు పనులు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే అమరావతి నుంచి క్రోసూరు వరకు రోడ్డు వెడల్పు చేసి రెడ్ మిక్స్ వేయడం జరిగింది. క్రోసూరు మండలం ఊటుకూరు వద్ద ఈ పనులన్నీ పూర్తి కావడంతో సిమెంట్ రోడ్డు పనులు మొదలుపెట్టారు. 33 అడుగుల వెడల్పుతో సిమెంట్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. శంకుస్థాపన రోజున తొమ్మిది నెలల్లో రోడ్డు పనులు పూర్తి చేస్తామని చెప్పామని.. అంతకంటే ముందే రోడ్డు పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయన్నారు. అమరావతి – బెల్లంకొండ్ డబుల్ లేన్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తున్నామన్నారు. మొదటగా ఊటుకూరులో రోడ్డు వెడల్పు పనులు పూర్తి కావడానికి గ్రామస్థులు సహకరించారన్నారు. అందుకే ఇంత త్వరగా సీసీ రోడ్లు పనులు ప్రారంభించామన్నారు. రూ.150 కోట్ల బడ్జెట్ తో జరుగుతున్న రోడ్డు పనులు రెండు నెలల్లోనే ఇంతవరకు రావడం సంతోషకరమన్నారు. పనులు వేగంగా చేస్తున్న కాంట్రాక్టర్లను, అధికారులను అభినందించారు. 2024 జనవరి నాటికి అమరావతి – బెల్లంకొండ డబుల్ లేన్ రోడ్డును పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు.