జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో కలెక్టర్ పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 3 ఏప్రిల్ నుండి 13 ఏప్రిల్ 2023 వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. ఇట్టి పరీక్షలకు 8,760 బాలురు, 8,113 బాలికలు మొత్తం 16,873 మంది విద్యార్దులు పరీక్షలు రాయనున్నట్లు, వీటి నిర్వహణకు 103 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఉ. 9.30 నుండి మ.12.30 వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్దులు ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని ఆయన సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన మౌళిక వసతులు ఏర్పాట్లు చేయాలని, వేసవి దృష్టా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రతి కేంద్రం వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, ఓ.అర్.ఎస్. ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆయన తెలిపారు. జిల్లాలో పరీక్ష ప్రశ్నపత్రాలను నిల్వచేయుటకు పోలీస్ స్టేషన్లలో తగిన ఏర్పాట్లు చేయాలని, పటిష్ట బందోబస్తు చేపట్టాలని ఆయన అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
సెంటర్లలో మాస్ కాపీయింగ్, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని ఆయన అన్నారు. ప్లైయింగ్ స్వ్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసి పరీక్ష జరుగుతున్న తీరుపై నిఘా వుంచాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలని ఆయన అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మంచి నీరు, ఫ్యాన్లు, లైట్లు సరిఅయిన విధంగా వుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. పరీక్ష నిర్వహణ అనంతరం సమాధాన పత్రాలను పోస్టల్ ద్వారా తరలించే ప్రక్రియ సజావుగా చేపట్టాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సరైన సమయంలో చేరుకునే విధంగా రూట్ల వారిగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, జిల్లా రవాణాధికారి కిషన్ రావు, మిషన్ భగీరథ ఇఇ పుష్పాలత, ఎస్బి ఏసీపీ ప్రసన్నకుమార్, ఖమ్మం మునిసిపల్ అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరి, జెడ్పి డిప్యూటీ సిఇఓ చంద్రశేఖర్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు, మధిర, వైరా మునిసిపల్ కమిషనర్లు రమాదేవి, అనిత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.