- ఉమ్మడి ఖమ్మం జిల్లాల త్రాగునీటి సరఫరా పర్యవేక్షణ ప్రత్యేక అధికారి, ప్రభుత్వ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఉభయ ఖమ్మం జిల్లాల త్రాగునీటి సరఫరా పర్యవేక్షణ ప్రత్యేక అధికారి, ప్రభుత్వ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి, మిషన్ భగీరథ, మునిసిపల్, ఇర్రిగేషన్, రెవిన్యూ, పంచాయతీ అధికారులతో జిల్లాలో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక అధికారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం త్రాగునీటి సరఫరా పర్యవేక్షణకై కార్యదర్శి స్థాయి అధికారిని జిల్లాలకు పంపిందని, దీన్ని బట్టి త్రాగునీటికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత నిస్తుందో తెలుస్తుందని అన్నారు. జిల్లా యంత్రాంగం పకడ్బందీ కార్యాచరణతో త్రాగునీటి సరఫరాపై ముందుకు వెళుతున్నదని, ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే, వెంటనే పరిష్కార చర్యలు చేపడుతుందని అన్నారు. త్రాగునీటి సరఫరాపై వస్తున్న వ్యతిరేక వార్తలపై వెంటనే స్పందించి, పరిష్కార చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ నెల 10న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో త్రాగునీటి సరఫరాపై సమావేశం ఉన్నట్లు, అట్టి సమావేశంలో జిల్లాకు కావాల్సిన నీటి విడుదలపై చర్యలు తీసుకోనున్నట్లు ఆయన అన్నారు. నీటి సరఫరా పైప్ లైన్ తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలను తన దృష్టికి తేవాలని ఆయన తెలిపారు. జిల్లా స్థాయి అధికారి నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ప్రతివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి త్రాగునీటి సరఫరాపై సమీక్షలు చేస్తున్నారని, అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.
సమీక్షలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, జిల్లాలో త్రాగునీటి సరఫరాపై వివరించారు. జిల్లాలో 957 గ్రామీణ అవాసాల్లో 93 త్రాగునీటికై కట్టడాలు, 2250.35 కి.మీ. మేర పైప్ లైన్ ఏర్పాటు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 6 ఇంటెక్ వెల్స్, 8 డబ్ల్యుటిపి లు, 54 ఓహెచ్బీఆర్ లు, 6 జిఎల్బిఆర్ లు, 19 సంప్ లు ఉన్నాయన్నారు. జిల్లాలో 1972 బోర్ వెల్స్ ఉండగా, 1627 పనిచేస్తున్నట్లు, 331 మరమ్మత్తులు చేయించినట్లు,14 పాడయినట్లు ఆయన అన్నారు. అదేవిధంగా 10005 హ్యాండ్ పంప్ లు ఉండగా, 7199 పనిచేస్తున్నట్లు, 1887 మరమ్మతులు చేయించినట్లు, 919 పూర్తిగా పాడయినట్లు ఆయన తెలిపారు. ఎస్డీఎఫ్ క్రింద రూ. 502.95 లక్షలతో 209 పనులు, డిఎంఎఫ్టి క్రింద రూ. 610.90 లక్షలతో 249 పనులు త్రాగునీటి సరఫరాకు సంబంధించి చేపట్టినట్లు ఆయన అన్నారు. ఇందులో 35 పనులు పూర్తి కాగా, 111 బోర్ పనులు, 109 పంప్ సెట్ పనులు పురోగతి లో ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా లేనిచోట స్థానికంగా వ్యవసాయ బావులు తదితర నీటి వనరులు అద్దెకు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు. హ్యాండ్ పంప్ విడి భాగాలు గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు, అన్ని గ్రామ పంచాయతీల్లో నీటి పరీక్షలకు క్లోరోస్కోప్ లు అందించినట్లు తెలిపారు. ప్రతి మండలంలో మండల ప్రత్యేక అధికారి, ఎంపిడివో, ఎంపిఓ, ఏఇఇ లు రోజువారి త్రాగునీటి సరఫరా పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో 100704 గృహాలకు 69 ఎంఎల్డి ప్రస్తుతం డిమాండ్ వున్నట్లు ఆయన తెలిపారు. మధిర మునిసిపాలిటీలో 6203 ఇంటి కనెక్షన్లకు 5.46 ఎంఎల్డి, సత్తుపల్లి మునిసిపాలిటీలో 6235 ఇంటి కనెక్షన్లకు 5.75 ఎంఎల్డి, వైరా మునిసిపాలిటీలో 9054 ఇంటి కనెక్షన్లకు 5.32 ఎంఎల్డి త్రాగునీటి సరఫరా డిమాండ్ ఉన్నట్లు ఆయన అన్నారు. ట్యాoకర్ల ద్వారా నీటి సరఫరా ఆవశ్యకత వస్తే, జిల్లాలో గ్రామపంచాయతీ లు, మునిసిపాలిటీల్లో 600 కు పైగా ట్యాoకర్లు ఉన్నట్లు, వీటిని వినియోగానికి తేనున్నట్లు ఆయన అన్నారు.
పాలేరు రిజర్వాయర్ ద్వారా జూన్ వరకు త్రాగునీటి సరఫరాకై 1.74 టీఎంసీ ల నీరు అవసరం ఉంటుందని, ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి వదులుతున్న నీటికి అదనంగా మే మాసంలో మరో టీఎంసీ నీరు అందిస్తే త్రాగునీటి సమస్యలు ఉండవని అన్నారు. వైరా రిజర్వాయర్ నకు జూన్ వరకు త్రాగునీటి అవసరాలకు 0.87 టీఎంసీ నీటి అవసరం ఉందని, నాగార్జున సాగర్ నుండి మే చివరి వారంలో 0.31 టీఎంసీ నీటి సరఫరా చేస్తే సమస్యలు ఉండవని అన్నారు. నీటి వనరులు లేనిచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుంటూ, త్రాగునీటి సరఫరా సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, మిషన్ భగీరథ సిఇ కె. శ్రీనివాస్, ఇర్రిగేషన్ సిఇ విద్యాసాగర్, మిషన్ భగీరథ ఎస్ఇ సదాశివకుమార్, ట్రాన్స్కో ఎస్ఇ సురేందర్, జెడ్పి సిఇఓ వినోద్, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ఇర్రిగేషన్, మిషన్ భగీరథ ఇంజనీర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.